AP High Speed Rail Corridor: ఏపీ దశ మార్చనున్న హైస్పీడ్ రైల్వే.. రూ.5.42 లక్షల కోట్లతో రెండు భారీ కారిడార్లు

AP to Get High Speed Rail Corridors with Rs 542 Lakh Crore Project
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రతిపాదన
  • రూ.5.42 లక్షల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం
  • ఆంధ్రప్రదేశ్ మీదుగా 767 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు
  • రాష్ట్రంలోని 11 జిల్లాలను కలుపుతూ 15 కొత్త స్టేషన్ల ఏర్పాటు
  • గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న రైళ్లు
  • భూసేకరణకు ఏపీ ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే లేఖ
ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ రెండు ప్రతిష్ఠాత్మకమైన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి రూట్ మ్యాప్‌ను ఖరారు చేసింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.5.42 లక్షల కోట్లు కాగా, ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వెళ్లనుండటం విశేషం.

మొత్తం 1,365 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు కారిడార్లలో సుమారు 767 కిలోమీటర్ల మార్గం ఏపీ భూభాగంలోనే నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక రైల్వే స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్-బెంగళూరు మార్గానికి రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై మార్గానికి రూ.3.04 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

ఏపీలో ప్రాజెక్టుల స్వరూపం
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ (మొత్తం పొడవు 605 కి.మీ.) ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్తుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా 263 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో మొత్తం 6 కొత్త స్టేషన్లు రానున్నాయి.

మరోవైపు హైదరాబాద్-చెన్నై కారిడార్ (మొత్తం పొడవు 760 కి.మీ.) రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా 504 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో 9 ప్రత్యేక స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఈ మార్గానికి అనుసంధానించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈ రెండు భారీ ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. సర్వే పనులను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని రైల్వే ఉన్నతాధికారులు కోరుతున్నారు.
AP High Speed Rail Corridor
South Central Railway
Hyderabad Bangalore rail corridor
Hyderabad Chennai rail corridor
Andhra Pradesh railway projects
Indian Railways
railway infrastructure
high speed rail India
railway stations Andhra Pradesh
Amara

More Telugu News