Saudia Airlines: ప్రయాణికుడికి అస్వస్థత.. తిరువనంతపురానికి సౌదియా విమానం మళ్లింపు

Saudia Flight Diverted to Trivandrum Due to Passenger Illness
  • విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి తీవ్ర అస్వస్థత
  • ఇండోనేషియా నుంచి మదీనా వెళ్తుండగా ఘటన
  • ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు 
ఇండోనేషియాలోని జకార్తా నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్తున్న సౌదియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (ఫ్లైట్ 821) అత్యవసరంగా కేరళలో ల్యాండ్ అయింది. మార్గమధ్యంలో  ఇండోనేషియా జాతీయుడైన ఒక ప్రయాణికుడు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన పైలట్లు సమీపంలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ అధికారులను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో విమానం తిరువనంతపురంలో ల్యాండ్ అయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందం, అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని హుటాహుటిన నగరంలోని అనంతపురి ఆసుపత్రికి తరలించింది.

ప్రస్తుతం ఆ ప్రయాణికుడు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చాతీ నొప్పితో బాధపడుతున్న అతడికి ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విమానం త్వరలోనే మదీనాకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
Saudia Airlines
Saudia flight 821
Trivandrum
Emergency landing
Medical emergency
Flight diversion
Indonesia
Madina
Ananthapuri Hospital
Passenger health

More Telugu News