Donald Trump: చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Trump Says 155 Percent Tariffs on China Inevitable
  • వ్యక్తిగతంగా తాను చైనాతో స్నేహ సంబంధాలే కోరుకుంటానని వ్యాఖ్య
  • అయినప్పటికీ కఠినంగా ఉండాల్సి వస్తోందన్న అమెరికా అధ్యక్షుడు
  • 155 శాతం టారిఫ్ ల అమలు తప్పేలా లేదని వెల్లడి
  • చైనాతో ఆర్థిక లావాదేవీలన్నీ సంవత్సరాల తరబడి ఏకపక్షంగా సాగాయన్న ట్రంప్
చైనాతో స్నేహంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని, అమెరికా అధ్యక్షుడిగా ఆలోచిస్తే కఠినంగా ఉండకతప్పని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. చైనా, అమెరికాల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ కొన్నేళ్లుగా ఏకపక్షంగా సాగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. దీనిని ఆపాల్సిన సమయం వచ్చిందని, ఈ క్రమంలోనే తాను చైనా పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చైనా తీరు వల్ల ఆ దేశంపై తాను విధించిన 155 శాతం టారిఫ్ లు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే నెల 1 నుంచి ఈ టారిఫ్ లు అమలులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షులు విదేశాలతో జరిపిన వ్యాపార లావాదేవీల విషయంలో తెలివిగా వ్యవహరించలేదని ట్రంప్ ఆరోపించారు. చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాతో ఇప్పటి వరకు జరిపిన లావాదేవీలలో చాలా లాభపడ్డాయని చెప్పారు. మాజీ అధ్యక్షుల ఉదారత్వాన్ని అడ్వాంటేజీగా తీసుకుని అమెరికాను ఒకరకంగా దోచుకున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి సాగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి తాను ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధిస్తున్నానని చెప్పారు.

‘మాతో వ్యాపారం చేస్తూ ఎంతో లాభపడ్డ చైనా.. ప్రస్తుతం ఆ దేశంలోని అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఈ విషయంలో చైనా తన తీరు మార్చుకోకుంటే ఇప్పటికే ప్రకటించినట్లు నవంబర్ 1 నుంచి చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై 155 శాతం పన్ను వసూలు చేస్తాం. ఇంత భారీ పన్నులు చెల్లించడం చైనా ఎగుమతిదారులకు అంత సులభం కాదని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Donald Trump
Trump China trade
US China trade war
China tariffs
US tariffs
China trade
United States trade
Trade war
China exports
US imports

More Telugu News