Couple Suicide: ఆరేళ్ల ప్రేమ.. నెల రోజుల పెళ్లి.. చివరకు మిగిలింది శోకమే

Jagityala couple commits suicide after dispute Gangotri Santosh
  • జగిత్యాలలో ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆత్మహత్య
  • కూరలో కారం ఎక్కువైందని భర్త మందలించడంతో భార్య బలవన్మరణం
  • దసరా రోజు భార్య ప్రాణాలు తీసుకోగా, దీపావళికి భర్త ఆత్మహత్య
  • భార్య మరణానికి తానే కారణమని భర్త తీవ్ర మనోవేదన
  • పెళ్లయిన నెల రోజులకే నవ దంపతుల మృతితో గ్రామంలో విషాదం
ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. కానీ వారి వివాహ‌ జీవితం నెల రోజులు కూడా నిలవలేదు. ఒక చిన్న గొడవ ఆ నవ దంపతుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దసరా పండుగ నాడు భార్య ఆత్మహత్య చేసుకోగా, భార్య మరణానికి తానే కారణమని తీవ్ర మనస్తాపంతో దీపావళి రోజు భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన సంతోష్, గంగోత్రి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ఇళ్లు ఎదురెదురుగానే ఉండటంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులను ఒప్పించి సెప్టెంబర్ 26న ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, దసరా పండుగ సందర్భంగా ఈ నెల‌ 2న ఈ జంట గంగోత్రి పుట్టింటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసే సమయంలో మాంసం కూరలో కారం ఎక్కువగా ఉందని సంతోష్ భార్యను మందలించాడు.

అందరి ముందు భర్త తిట్టడంతో తీవ్రంగా నొచ్చుకున్న గంగోత్రి, అదే రోజు రాత్రి అత్తారింటికి తిరిగి వచ్చాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన వల్లే చనిపోయిందని సంతోష్ తీవ్ర వేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి కుమిలిపోతూ, మానసికంగా కృంగిపోయాడు.

ఈ క్రమంలో దీపావళి పండుగ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లాడు. అక్కడ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతను కూడా ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఇలా పండుగల నాడు భార్యాభర్తలిద్దరూ నెల రోజుల వ్యవధిలో బలవన్మరణానికి పాల్పడటంతో ఇరు కుటుంబాలతో పాటు ఎర్దండి గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నపాటి క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొనడం స్థానికులను కలచివేసింది.
Couple Suicide
Santosh
Santosh Gangotri
Gangotri
Jagityala district
Ibrahimpatnam
Errdandi village
love marriage suicide
domestic dispute suicide
Andhra Pradesh news

More Telugu News