Tirumala: శ్రీవారి దర్శనం పేరుతో కోటి కొట్టేశాడు.. కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tirumala Fraudster Ashok Kumar Reddy Arrested for Crores Scam
  • శ్రీవారి దర్శనం పేరుతో భక్తులకు భారీ టోకరా
  • ఏడాదిలో కోటికి పైగా వసూలు చేసిన కేటుగాడు
  • రాక్‌స్టార్ ఈవెంట్స్ పేరుతో నకిలీ సంస్థ ఏర్పాటు
  • డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మోసం
  • నిందితుడు అశోక్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తానని చెప్పి భక్తులను నమ్మించి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన బురిగాల అశోక్‌ కుమార్‌రెడ్డి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళితే... అశోక్ కుమార్ రెడ్డి ‘రాక్‌స్టార్‌ ఈవెంట్స్‌’ పేరుతో ఒక నకిలీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను సృష్టించాడు. తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, సులభంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, సుప్రభాత సేవ వంటి టికెట్లతో పాటు గదులు కూడా ఇప్పిస్తానని భక్తులను నమ్మించేవాడు. అతని మాటలు నమ్మిన భక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. తీరా భక్తులు ఆశగా తిరుమలకు చేరుకున్నాక, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి వారికి దొరక్కుండా తప్పించుకునేవాడు.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులకు ఇదే తరహాలో దర్శనాలు, సేవలు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. వారు తిరుమలకు రాగానే అశోక్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తాము మోసపోయామని గ్రహించి, వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుమల టూటౌన్ పోలీసులు ఈ నెల 16న కేసు నమోదు చేసి, నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి బ్యాంకు ఖాతాలో కేవలం ఏడాది కాలంలోనే కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది. అమన్ గోయల్ అనే భక్తుడి నుంచి రూ.4,16,500 వసూలు చేయడంతో పాటు, గౌతమ్ గుప్తా, రాధిక అగర్వాల్ వంటి ఎందరినో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా దళారులు దర్శనం ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని, అలాంటి వారి సమాచారాన్ని వెంటనే తిరుమల వన్‌టౌన్ (94407 96769), టూటౌన్ (94407 96772) పోలీసులకు తెలియజేయాలని కోరారు.
Tirumala
Ashok Kumar Reddy
Srivari Darshanam
TTD
Temple
Fraud
Arrest
Scam
Andhra Pradesh
Tirupati

More Telugu News