Nara Lokesh: ఏపీలో గ్రిఫిత్ యూనివర్సిటీ హబ్.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన

Nara Lokesh Proposes Griffith University Hub in Andhra Pradesh
  • ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • ఏపీలో యూనివర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
  • ఏపీ వర్సిటీలతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లపై కీలక చర్చ
  • నైపుణ్యాభివృద్ధికి ఏపీఎస్‌ఎస్‌డీసీతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి
  • పరిశోధన, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలపై ప్రధాన దృష్టి
ఏపీ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యావకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవ తీసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన, గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో సమావేశమై కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీలో గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. ఏపీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన ఎస్‌ఆర్‌ఎం-ఏపీ, ఆంధ్రా యూనివర్సిటీ, విట్-ఏపీ వంటి సంస్థలతో కలిసి డ్యూయల్-డిగ్రీ, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధ్రువీకరణ కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం కావాలని కోరారు. పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ వంటి అంశాలపై సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు.

అలాగే, ఏపీలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. వ‌చ్చే నెల‌ 14, 15 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించనున్న పార్ట్నర్‌షిప్ సమ్మిట్ - 2025, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ సమావేశాలకు హాజరుకావాలని మార్నీ వాట్సన్‌ను ఆయన ఆహ్వానించారు.

అంతకుముందు మార్నీ వాట్సన్ తమ విశ్వవిద్యాలయం గురించి మంత్రి లోకేశ్‌కు వివరించారు. 1975లో స్థాపించిన గ్రిఫిత్ యూనివర్సిటీ, ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. తమ ఐదు క్యాంపస్‌లలో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, భారత్‌లో ఐఐటీ రూర్కీతో కలిసి ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Nara Lokesh
Griffith University
AP Education
Andhra Pradesh
Partnership Summit 2025
Global Education Forum
SRM AP
Andhra University
VIT AP
Ratan Tata Innovation Hub

More Telugu News