Ramakrishna CPI: రామకృష్ణకు ప్రమోషన్.. సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక

Ramakrishna Elected as CPI National Secretary
  • సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత రామకృష్ణ
  • చంఢీగఢ్‌ జాతీయ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఇంతకాలం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన రామకృష్ణ
  • ఏపీ సీపీఐకి నూతన కార్యదర్శిగా ఈశ్వరయ్య ఏకగ్రీవం 
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటిదాకా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కె. రామకృష్ణ ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చంఢీగఢ్‌లో జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో ఈ నియామకం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయనకు లభించిన గుర్తింపు ఈ పదవికి దోహదపడింది. రామకృష్ణ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో, ఏపీ సీపీఐ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా పార్టీ భర్తీ చేసింది. ఏపీ సీపీఐ కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

వాస్తవానికి ఆగస్టులో ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహాసభల్లోనే నూతన కార్యదర్శి ఎన్నిక పూర్తి కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. జాతీయ మహాసభల తర్వాతే ఈ నియామకం ఉంటుందని అప్పట్లో పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. దాని ప్రకారమే తాజా ఎన్నిక జరిగింది.

ఇప్పటిదాకా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన కె.రామకృష్ణ మూడు పర్యాయాలు ఈ పదవిని చేపట్టడంతో, పార్టీ నిబంధనల ప్రకారం ఆయన కొనసాగేందుకు వీల్లేదు. దాంతో, ఆయన స్థానంలో ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 
Ramakrishna CPI
CPI National Secretary
Communist Party of India
G Eswaraiah
AP CPI Secretary
CPI National Council
Indian Politics
Andhra Pradesh Politics
Chandigarh CPI
Ongole CPI

More Telugu News