Padmanabha Reddy: 42 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం కానీ 50 శాతం మించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్

Padmanabha Reddy Welcomes 42 Percent Reservations Demands Local Elections
  • సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 50 శాతం మించకుండా తక్షణమే ఎన్నికలు జరపాలని సూచన
  • పంచాయతీ ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుగా మారాయని వెల్లడి
  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికలు నిర్వహించే అధికారాలు ఉన్నాయన్న ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తోందని, అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం. పద్మనాభరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ల సమస్య అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 కోర్టుల్లో నిలబడలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం తేలే వరకు ఎన్నికలు జరపకపోవడం అంటే పంచాయతీలను నిర్వీర్యం చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికే అప్పగించారని గుర్తు చేశారు. 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. గ్రామ పంచాయతీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలను ముడిపెట్టడంతో సమస్య మొదలైందని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు తాజాగా వెల్లడించిన తీర్పు ప్రకారం ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

అయితే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలతో ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించుకోకుండా ప్రభుత్వంలో ఒక శాఖగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Padmanabha Reddy
Forum for Good Governance
BC Reservations
Local Body Elections
Panchayat Elections

More Telugu News