Bambino Agro Industries: బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం.. మనవరాళ్లపై కేసు నమోదు

Madam Kishan Rao Granddaughters Face Charges in Inheritance Fraud Case
  • బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం
  • తాత కంపెనీ షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న మనవరాళ్లు
  • నకిలీ పత్రాలతో రూ.40 కోట్ల బ్యాంకు రుణం
  • నలుగురు అక్కాచెల్లెళ్లపై తమ్ముడు కార్తికేయ ఫిర్యాదు
  • మోసం, నమ్మకద్రోహం కింద కేసు నమోదు చేసిన సీసీఎస్
ప్రముఖ పారిశ్రామికవేత్త, బాంబినో ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులైన దివంగత మ్యాడం కిషన్ రావు కుటుంబంలోని వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన రాసిన వీలునామాను పక్కనపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి కంపెనీ ఆస్తులను తనఖా పెట్టి రూ. 40 కోట్ల రుణం పొందారనే ఆరోపణలపై ఆయన నలుగురు మనవరాళ్లపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు నమోదు చేసింది. మ్యాడం కిషన్ రావు మనవడు, బంజారాహిల్స్ నివాసి అయిన మ్యాడం కార్తికేయ (34) ఈ నెల‌ 8న తన సోదరీమణులపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

మనవడు మ్యాడం కార్తికేయ  ఫిర్యాదు లోని  వివరాల ప్రకారం, మ్యాడం కిషన్ రావు 1973లో రేవతి టొబాకో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఈ కంపెనీలో ఆయనకు 98.23 శాతం, ఆయన భార్య సుగంధ బాయికి 1.77 శాతం వాటాలు ఉన్నాయి. ఈ కంపెనీ పేరు మీద ఉన్న 184 ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, 2021లో కిషన్ రావు మరణానంతరం ఆయన మనవరాళ్లు అనురాధ విప్పల రావు, శ్రీదేవి కజ్జం, ఆనంద దేవి లోగిశెట్టి, తుల్జా భవాని మ్యాడం కంపెనీ రికార్డులను తారుమారు చేశారని కార్తికేయ తన ఫిర్యాదులో ఆరోపించారు.

కిషన్ రావు రాసిన రిజిస్టర్డ్ వీలునామాను ఉల్లంఘించి, 2023లో ఆయన పేరిట ఉన్న మొత్తం షేర్లను తమ పేర్ల మీదకు అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అదే కంపెనీ ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారని తెలిపారు. వీలునామా ప్రకారం, కుటుంబ సభ్యులకు ఆస్తుల పంపిణీ జరగాల్సి ఉండగా, నిందితులు కంపెనీ డైరెక్టర్లుగా చలామణి అవుతూ బ్యాంకులను, ఇతర లబ్ధిదారులను మోసం చేశారని ఆరోపించారు.

ఈ కేసులో ఆర్థిక నేరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దర్యాప్తును సిట్-సీసీఎస్‌కు బదిలీ చేశారు. నిందితులపై ఫోర్జరీ, నమ్మకద్రోహం, మోసం వంటి అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 405,406,417,420,r/w 34,r/w 120b లతో పాటు బీఎన్‌ఎస్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 175(3) కింద కేసు నమోదు చేశారు. సీసీఎస్ ఏసీపీ వి. నరసింహారెడ్డి, ఎస్సై రాంచందర్ నాయక్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Bambino Agro Industries
Madam Kishan Rao
Revathi Tobacco Company
property dispute
fraud
forgery
loan fraud
Hyderabad
will
inheritance

More Telugu News