Karnakota brothers: ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చి రూ.20 కోట్ల పరిహారం పొందిన ఘనులు.. ఖాజాగూడలో ఘరానా మోసం

Khajaguda Land Grab Fake Records Used to Claim Crores in Government Compensation
  • నకిలీ రికార్డులతో ప్రభుత్వ భూమి కబ్జా
  • రోడ్డు నిర్మాణంలో కొంత భూమి పోవడంతో ప్రభుత్వ పరిహారం
  • మిగతా 30 గుంటల భూమి విలువ వంద కోట్లకు పైనే..
  • రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసి నిర్మాణాలు
ఖాజాగూడాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కబ్జాదారులు.. నకిలీ రికార్డులు సృష్టించి అమ్మేశారు. కొన్నేండ్ల తర్వాత అమ్మిన వారి నుంచి తిరిగి కొంత భూమిని కొనుగోలు చేశారు. రోడ్డు నిర్మాణంలో ఆ భూమిలో కొంతభాగం పోవడంతో ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. అంటే.. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చి పరిహారం పొందారన్నమాట.. ఖాజాగూడలో జరిగిన ఈ మోసం వివరాలు..

పట్టా భూమి పక్కనే ప్రభుత్వ భూమి..
ఖాజాగూడలోని సర్వే నంబరు 25లో సిరిగాని మల్లయ్యకు 2.23 ఎకరాల (103 గుంటలు) పట్టా భూమి ఉంది. ఈ స్థలాన్ని 1990లో కర్ణకోట చంద్రమ్మకు అమ్మగా.. 2000లో చంద్రమ్మ, ఆమె కుమారులు కర్ణకోట గోపాల్, శంకర్, అనంతరాజు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మేశారు. అయితే, సర్వే నెంబర్ 25 లోని తమ పట్టాభూమితో పాటు పక్కనే సర్వే నెంబర్ 27 లోని ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకున్నారు. తమ పేరుమీద ఉన్న భూ పరిమాణాన్ని పెంచుకుంటూ నకిలీ రికార్డులు సృష్టించి 2006లో పీపీఆర్‌ యాదవ్, పీవీ రమణ యాదవ్, పీఎన్‌వీ వంశీధర్, ఎస్‌వీ సంజీవ రెడ్డిలకు అమ్మారు. తర్వాత కొంతకాలానికి వంశీధర్, సంజీవరెడ్డిల నుంచి 51 గుంటల భూమిని తిరిగి ఆ ముగ్గురు సోదరులు కొనుగోలు చేశారు.

ప్రభుత్వ పరిహారం..
ఖాజాగూడ చెరువు నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో ఈ కబ్జా చేసిన భూమిలో కొంతభాగం పోయింది. దీంతో కర్ణకోట సోదరులు ముగ్గురూ తమ భూమి కోల్పోయామని పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. లింక్ డాక్యుమెంట్లు సరిగా పరిశీలించకుండానే రెవెన్యూ అధికారులు 2,611 గజాల స్థలానికి రూ.20 కోట్ల టీడీఆర్‌ (భూ అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చారు. రోడ్డు నిర్మాణంలో పోగా 30 గుంటలు కర్ణకోట సోదరుల అధీనంలోనే ఉంది. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని కర్ణకోట సోదరులు 2021లో బ్లూ ఐరిష్‌ సంస్థకు ఇచ్చి అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూమి చుట్టూ రేకులతో కంచె ఏర్పాటు చేసి బీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ నిర్మాణాలు చేపట్టింది.
Karnakota brothers
Khajaguda
government land scam
Telangana land grab
fake land records
ORR road construction
TDR compensation
Blue Irish company
BSR Constructions
Hyderabad real estate

More Telugu News