Sajjanar: పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త: సజ్జనార్

Sajjanar warns about fake kidnapping calls in Hyderabad
  • మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న సజ్జనార్
  • మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి
  • అత్యాశ, భయం... ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయని వ్యాఖ్య
మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా హెచ్చరిక జారీ చేశారు. మీ పిల్లల పేర్లను చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని మీకు వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ సూచన చేశారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్‌ను పంచుకున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
Sajjanar
Hyderabad Police
Cyber Crime
Kidnapping
Fake Calls
Cyber Security
Online Fraud

More Telugu News