Ashwini Vaishnaw: ఇవిగో 12 వేల రైళ్లు... కాంగ్రెస్ విమర్శలకు రైల్వే శాఖ కౌంటర్

Railways Responds to Congress Claims About Special Trains
  • దేశ వ్యాప్తంగా 12వేల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • రీల్ మినిస్టర్ .. 12వేల రైళ్లు ఎక్కడ అంటూ ప్రశ్నించిన కాంగ్రెస్
  • ఎక్స్ వేదికగా ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసిన రైల్వే శాఖ
రైల్వే శాఖ, కాంగ్రెస్ పార్టీల మధ్య పండుగ ప్రత్యేక రైళ్ల అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. దీపావళి, ఛఠ్ పూజ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. "రీల్ మినిస్టర్... 12 వేల రైళ్లు ఎక్కడ?" అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వ్యంగ్యంగా ప్రశ్నించింది.

దీనిపై రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా నడపనున్న ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితాను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ జాబితాలో జోన్ వారీగా నడిపే ప్రత్యేక సర్వీసులు, రైలు సంఖ్యలు, మార్గాలు, షెడ్యూల్ వివరాలను పొందుపరిచింది.

రైల్వే శాఖ ప్రతిస్పందిస్తూ.. "ప్రయాణికులు పండుగ సమయంలో తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఈ ప్రత్యేక రైలు సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ప్రజల్లో గందరగోళం రేకెత్తించేలా తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలను పోస్ట్ చేయవద్దు," అని కాంగ్రెస్‌కు పరోక్షంగా విజ్ఞప్తి చేసింది.

పండుగ సీజన్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లే నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. మొత్తంగా "12 వేల రైళ్లు లేవు" అని కాంగ్రెస్ చేసిన విమర్శలకు రైల్వే శాఖ గట్టిగా బదులిచ్చింది. పండుగ సీజన్‌లో నడుపుతున్న ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేయడం ద్వారా తమ వాదనకు ఆధారాలు చూపిస్తూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చింది. 
Ashwini Vaishnaw
Indian Railways
festival special trains
Diwali
Chhath Puja
Indian National Congress
railway minister
special trains list
India
railway counter

More Telugu News