Chandrababu: విశాఖ గూగుల్ ప్రాజెక్టుపై విమర్శలా?.. వాళ్లవి మూర్ఖపు మాటలు: సీఎం చంద్రబాబు

Chandrababu Slams Critics of Google Project in Visakhapatnam
  • విశాఖ గూగుల్ ఏఐ సెంటర్‌పై విమర్శలు మూర్ఖత్వమ‌న్న‌ సీఎం
  • రాష్ట్రాన్ని ఏఐకి చిరునామాగా మార్చేస్తామన్న చంద్రబాబు
  • అమెరికా బయట గూగుల్ అతిపెద్ద పెట్టుబడి ఇదేన‌ని వెల్ల‌డి
  • ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ప్రకటన
  • గత ఐదేళ్ల పాలనపై సీఎం తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు చిరునామాగా మార్చి, ప్రపంచంలోనే కేరాఫ్‌గా నిలుపుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏఐ డాటా సెంటర్ ఏర్పాటు చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక, రాజకీయ కక్షతో మూర్ఖంగా విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో 'సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ' నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన తన అర్ధాంగి భువ‌నేశ్వ‌రితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 12 దేశాలకు సేవలు అందుతాయి. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం మనకు గర్వకారణం. ఏఐ రాకతో రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం" అని స్పష్టం చేశారు.

గత పాలనపై తీవ్ర విమర్శలు
గత ఐదేళ్ల రాక్షస పాలనను ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టారని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కూటమిని 94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిపించారని గుర్తుచేశారు. "వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది. 2019-24 మధ్య ప్రజలు సంతోషంగా పండుగలు కూడా జరుపుకోలేని దుస్థితి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందుతున్నాయి" అని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏటా రూ.15 వేలు ఆదా అవుతోందని వివరించారు.

ఉద్యోగులకు దీపావళి కానుకలు
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. పోలీసులకు ఒక సరెండర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నామని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగులకు గౌరవం పెంచేలా వారి హోదాను రీ-డిజిగ్నేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, దేశంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు సీఎం చంద్రబాబు బీసెంట్ రోడ్‌లో పర్యటించి చిరువ్యాపారులు, దుకాణదారులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు ఎలా తగ్గాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పున్నమి ఘాట్‌లో అనాథ పిల్లలతో కలిసి దీపావళి క్రాకర్ షోను వీక్షించారు.
Chandrababu
Andhra Pradesh
Artificial Intelligence
Google
Visakhapatnam
AP Development
GST
Employee Benefits
Diwali
AP Economy

More Telugu News