MBBS Seats: డాక్టర్ కావాలనుకునేవారికి గుడ్ న్యూస్.. 10 వేలకు పైగా కొత్త సీట్లు

National Medical Commission Announces 10650 New MBBS Seats
  • 2024-25 విద్యా సంవత్సరానికి 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
  • దేశవ్యాప్తంగా 41 కొత్త వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ ఆమోదం
  • మొత్తం 1.37 లక్షలకు చేరిన ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య
  • త్వరలో మరో 5 వేల పీజీ సీట్లు పెరిగే అవకాశం
  • వైద్య విద్య సిలబస్‌లో క్లినికల్ రిసెర్చ్‌ను చేర్చాలని నిర్ణయం
దేశవ్యాప్తంగా డాక్టర్ కావాలని కలలు కంటున్న విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీపికబురు అందించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏకంగా 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు ఆమోదం తెలుపుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో పాటు దేశంలో కొత్తగా 41 వైద్య కళాశాలల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య విద్యను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

తాజా పెంపుతో దేశంలోని మొత్తం వైద్య కళాశాలల సంఖ్య 816కు చేరుకుంది. అలాగే, అందుబాటులో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు ఎగబాకింది. ఇది వైద్య విద్య ఆశావహులకు గొప్ప అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) సీట్లను కూడా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్‌ఎంసీ చీఫ్ అభిజిత్ తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు 5,000 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచే దిశగా మరో కీలక అడుగు వేస్తున్నట్లు అభిజిత్ వెల్లడించారు. ఇకపై క్లినికల్ రిసెర్చ్‌ను ప్రధాన సిలబస్‌లో భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సహకారం తీసుకోనున్నట్లు వివరించారు.

కళాశాలల గుర్తింపు, సీట్ల లభ్యత, పరీక్షల విధానం వంటి అంశాలపై పూర్తి స్పష్టతతో కూడిన బ్లూ ప్రింట్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అభిజిత్ పేర్కొన్నారు. అలాగే, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కోసం ఈ ఏడాది నవంబర్‌లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
MBBS Seats
National Medical Commission
medical colleges
Abhijit
medical education
PG seats
clinical research
ICMR
medical admissions

More Telugu News