Chandrababu Naidu: విజయవాడ బీసెంట్ రోడ్ లో సీఎం చంద్రబాబు సర్ ప్రైజ్ విజిట్.. ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Surprise Visit to Vijayawada Besant Road
  • విజయవాడ బీసెంట్ రోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • చిరు, వీధి వ్యాపారులతో నేరుగా ముఖాముఖి
  • జీఎస్టీ తగ్గింపు ప్రభావంపై ఆరా తీసిన సీఎం
  • వస్తువుల ధరలు తగ్గాయా అని వ్యాపారులకు ప్రశ్న
  • కొనుగోలుదారులతోనూ మాట్లాడిన ముఖ్యమంత్రి
ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తోంది? ఈ ప్రయోజనాలు సామాన్యులకు అందుతున్నాయా? ఈ విషయాలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జనంలోకి వెళ్లారు. ఆదివారం ఆయన విజయవాడలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన బీసెంట్ రోడ్‌ను సందర్శించి, అక్కడి వ్యాపారులు, కొనుగోలుదారులతో ముఖాముఖిగా సంభాషించారు.

నగర పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి బీసెంట్ రోడ్‌లోని పలువురు చిరు వ్యాపారులు, వీధి వర్తకులు, జనరల్ స్టోర్ల యజమానులు, చెప్పుల దుకాణాల నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీని తగ్గించడం వల్ల వస్తువుల ధరలు వాస్తవంగా తగ్గాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్ణయంతో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోందనే వివరాలను వారి నుంచి సేకరించారు.

అదే సమయంలో, షాపింగ్ కోసం బీసెంట్ రోడ్‌కు వచ్చిన కొందరు కొనుగోలుదారులను కూడా ముఖ్యమంత్రి పలకరించారు. ధరల తగ్గుదల వారికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తోందనే దానిపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నేరుగా తమ వద్దకు వచ్చి మాట్లాడటంతో వ్యాపారులు, స్థానికులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Chandrababu Naidu
Vijayawada
Besant Road
GST reduction
Andhra Pradesh
AP CM
Business
Retail
Public interaction
Price reduction

More Telugu News