Nara Lokesh: ఆస్ట్రేలియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యం!

Nara Lokesh Invites Australian Companies to Invest in Andhra Pradesh
  • సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌తో మంత్రి లోకేశ్ భేటీ
  •  ఏపీని తమ స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో చేర్చాలని ఫోరమ్‌కు విజ్ఞప్తి
  •  రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపు
  •  కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం క్లస్టర్లలో పెట్టుబడులకు ఆహ్వానం
  • నవంబర్‌లో జరిగే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని విజ్ఞప్తి
  • ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నామని తెలిపిన ఫోరం డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సిడ్నీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

ఈ భేటీలో కీలక పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను తమ స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో చేర్చాలని లోకేశ్ ఫోరమ్‌ను కోరారు. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా కలిసి నిర్వహించనున్న ‘ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్’ సమావేశానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఇంధనం, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ వంటి కీలక రంగాల్లో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈవోలకు వివరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కోరారు.

   ఇదే క్రమంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్–2025కు ఫోరం నాయకత్వ బృందంతో సహా హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. తదుపరి సీఈవోల ఫోరం సెషన్‌లో ఏపీకి భాగస్వామ్యం కల్పించాలని, ఆ సమావేశంలో రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాలను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు.

లోకేశ్ విజ్ఞప్తిపై స్పందించిన మెక్ కే ఫోరం కార్యకలాపాలను వివరించారు. ఇరు దేశాల ప్రధానుల చొరవతో 2012లో ఈ ఫోరం ప్రారంభమైందని, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యమని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. సుమారు 48.4 బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యానికి తమ ఫోరం మద్దతు ఇస్తోందని, విధానపరమైన సహకారం కోసం సీఐఐతో కలిసి పనిచేస్తున్నామని ఆమె వివరించారు.
Nara Lokesh
Andhra Pradesh
Australia
Investments
APEDB
Partnership Summit 2025
Visakhapatnam
Krishnapatnam
Ports
Logistics

More Telugu News