ACB Raids: తెలంగాణ ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు.. పండుగ టైంలో భారీగా పట్టుబడ్డ అక్రమ నగదు!

ACB Raids on Telangana RTA Checkposts During Diwali
  • దీపావళి పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్ల ఆరోపణలు
  • సంగారెడ్డి, కొత్తగూడెం, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు
  • బోరాజ్ చెక్‌పోస్టులో రూ. 1,26,000 అక్రమ నగదు స్వాధీనం
  • వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా భారీగా నగదు సీజ్
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులపై శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పలుచోట్ల లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని మడ్గి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని పలు ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా కొమరం భీం జిల్లాలోని బోరాజ్ చెక్‌పోస్టులో రూ. 1,26,000, వాంకిడి చెక్‌పోస్టులో రూ. 5,100 అక్రమ నగదును అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

ఇదే తరహాలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సాలబత్‌పూర్ ఆర్‌టీవో చెక్‌పోస్టులోనూ సోదాలు జరిగాయి. బిక్కనూరు మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్‌పాయింట్ వద్ద ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 51,300 స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ మరో రూ. 3,000 పట్టుబడింది. దీపావళి పండుగకు తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వాహనదారుల నుంచి కొందరు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులతో ఏసీబీ ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సరిహద్దు జిల్లాల్లోని చెక్‌పోస్టులపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
ACB Raids
Telangana RTA
RTA Checkposts
Anti Corruption Bureau
Diwali Festival
Illegal Cash
Sangareddy
Komaram Bheem
Kamareddy
Telangana News

More Telugu News