Nadendla Manohar: తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Recalls Fathers Words at Rice Millers Meet
  • రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల సమావేశం
  • ఖరీఫ్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
  • ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రారంభం
  • ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
  • వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు సులభమైన రిజిస్ట్రేషన్
పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు తన తండ్రి చెప్పిన మాటలను మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. "పది మందికి ఉపాధి కల్పిస్తూ, గౌరవం కోసం పనిచేసే రైస్ మిల్లర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి" అని తన తండ్రి సూచించారని ఆయన తెలిపారు. విజయవాడలోని తాజ్ వివంత హోటల్‌లో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తండ్రి సూచనలు పాటిస్తున్నానని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందర్నీ కలుపుకొని పనిచేస్తున్న మిల్లర్లకు అండగా ఉంటానని తెలిపారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు నాదెండ్ల తెలిపారు. ఇకపై వాట్సాప్ ద్వారా కేవలం 'హాయ్' అని సందేశం పంపితే చాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను కాగితరహితంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.

గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన రూ. 1,674 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందని, అలాగే మిల్లర్లకు ఇవ్వాల్సిన రూ. 763 కోట్లను కూడా చెల్లించి పారదర్శకతను నిరూపించుకున్నామని నాదెండ్ల పేర్కొన్నారు. బ్యాంక్ గ్యారెంటీల నిష్పత్తిని 1:2గా నిర్ణయించామని, దీని కోసం 35 బ్యాంకుల సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

తేమ శాతం కొలిచే యంత్రాలు, నాణ్యమైన గోనె సంచులు, రవాణా సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు మంత్రి సూచించారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వ్యవస్థను గౌరవిస్తూ, రైతు సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా మార్పు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ఈ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 10,700 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ ప్రతినిధులకు ముందుగానే మంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు..

పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ వివరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ & ఎండీ ఢిల్లీ రావు మాట్లాడుతూ ఈరోజు జాయిన్ అయిన నేను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు. 2024-2025 సంవత్సరం ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిందన్నారు.

సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్. గోవిందరావు, ఎఫ్ సీఐ జీఎం విజయ్ కుమార్ యాదవ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూరి ప్రకాశ్ రావు కోశాధికారి రంగయ్య నాయుడు మరియు 26 జిల్లాల రైస్ మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.


Nadendla Manohar
Andhra Pradesh
Rice Millers Association
Paddy Procurement
Civil Supplies
Farmers Welfare
Kharif Season
Whatsapp Registration
PDS Rice Smuggling
Bank Guarantee

More Telugu News