Priyank Kharge: ఆ అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది: ప్రియాంక్ ఖర్గే

Priyank Kharge Government Issues Show Cause Notice to Officials Over RSS Event
  • ఆరెస్సెస్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న అధికారులకు షోకాజ్ నోటీసులు 
  • తన శాఖలో ఆరెస్సెస్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినట్లు ఖర్గే వెల్లడి
  • ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నప్పటికీ, ఉద్యోగులు నిబంధనలు పాటించాలని వ్యాఖ్య
ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, వారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని వచ్చిన వార్తలను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ధృవీకరించారు. తన శాఖలో ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎవరి సిద్ధాంతాలు వారికి ఉండవచ్చని, కానీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఆరెస్సెస్, బీజేపీ జన సమీకరణ పేరుతో సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి సమావేశాలను నిర్వహించరాదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంస్థల సమావేశాలు నిర్వహించకూడదని తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఖర్గే తెలిపారు.

అందుకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలకు సంబంధించిన కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక నుంచి ఎలాంటి సమీకరణాలకు, సమావేశాలకైనా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మహాత్మాగాంధీ వంటి గొప్ప వ్యక్తులనే ఆరెస్సెస్, బీజేపీ వాళ్లు లెక్కచేయనప్పుడు ఇక తాను ఎంత అని ప్రశ్నించారు. ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆరెస్సెస్ తరఫున ఎందుకు మాట్లాడుతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్ తరఫున మాట్లాడేందుకు వాళ్లెవరు.. తనను తాను సమర్థించుకోలేదా? అని ప్రశ్నించారు.

ఆరెస్సెస్ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు తటస్థంగా ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ కర్ణాటక స్టేట్ సివిల్ సర్వీసెస్ రూల్స్-2021ను అమలు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన కోరారు. ఇది తాను పెట్టిన నిబంధన కాదని, కర్ణాటక సివిల్ సర్వీసెస్ నిబంధన అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సంస్థలతో సంబంధం ఉన్న ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదనే ఆ నిబంధన చెబుతోందని అన్నారు.
Priyank Kharge
RSS
Karnataka
Show cause notice
Government officials
BJP
Siddaramaiah
Karnataka State Civil Services Rules 2021

More Telugu News