Mohammad Yousuf: ట్రోఫీ ఇవ్వకుండా మంచి పనే చేశారు.. టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Mohammad Yousuf Criticizes India on Asia Cup Trophy Issue
  • ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై పాక్ మాజీ ప్లేయర్ యూసుఫ్ కామెంట్స్
  • టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా పీసీబీ ఛైర్మన్ సరైన పనే చేశారన్న యూసుఫ్
  • అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడెందుకు తొందర అంటూ భారత జట్టుపై విమర్శలు
  • ఆటను వదిలేసి సినిమాలు తీసుకుంటున్నారంటూ ఎద్దేవా
  • గతంలో సూర్యకుమార్‌పై దారుణ వ్యాఖ్యలు చేసిన యూసుఫ్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి మద్దతు ప‌లికాడు. భారత జట్టు ప్రవర్తనను తప్పుబడుతూ, వారికి ట్రోఫీ ఇవ్వకపోవడమే సరైన చర్య అని వ్యాఖ్యానించాడు.

ఆసియా కప్ ఫైనల్ గెలిచిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా టీమిండియా, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు అందజేయకుండా తనతో పాటే తీసుకెళ్లారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌కు చెందిన 'సమా టీవీ' ఛానెల్‌తో యూసుఫ్ మాట్లాడాడు.

"ఛైర్మన్ (మొహ్సిన్ నఖ్వీ) చేసింది పూర్తిగా సరైనదే. ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు" అని యూసుఫ్ అన్నాడు. "ఏసీసీ, ఐసీసీ నిబంధనల ప్రకారం, ఆయన అక్కడ ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే ట్రోఫీని తీసుకోవాలి. ఆ సమయంలో మీరు తీసుకోలేదు. మరిప్పుడెందుకు ఆ తొందర? ట్రోఫీ గుర్తుకువచ్చినప్పుడు ఆయన ఆఫీసుకు వెళ్లి తెచ్చుకోవాల్సింది" అని పేర్కొన్నాడు.

అంతటితో ఆగకుండా భారత జట్టుపై యూసుఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "మైదానంలో మీరు మీ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను. వాళ్లు సినిమా ప్రపంచం నుంచి బయటకు రావడం లేదు. ఇది క్రీడ, ఇది క్రికెట్. ఇక్కడ సినిమాలు నడవవు. సినిమాల్లో రీటేక్‌లు ఉంటాయి కానీ, క్రీడల్లో అలా కాదు. ఇప్పుడు మీకు ట్రోఫీ కావాలంటున్నారు" అంటూ ఎద్దేవా చేశాడు.

ఆసియా కప్ ఫైనల్ జరిగి మూడు వారాలు దాటినా ఇప్పటికీ ట్రోఫీ భారత జట్టుకు చేరలేదు. కాగా, మహమ్మద్ యూసుఫ్ గతంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 'పంది' అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారత క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Mohammad Yousuf
Pakistan cricket
Asia Cup 2025
Mohsin Naqvi
India cricket team
ACC
ICC
trophy controversy
cricket news

More Telugu News