దీపావళికి ప్రత్యేక రైళ్లు.. గుంటూరు మీదుగా సికింద్రాబాద్, తిరుపతికి సర్వీసులు!
- నేడు, రేపు నడవనున్న స్పెషల్ రైళ్లు
- తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
- విజయవాడ - సికింద్రాబాద్ మధ్య మరో రెండు రైళ్లు
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి - సికింద్రాబాద్ స్పెషల్ (07497) రైలు నేటి రాత్రి 7:40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఈ రైలు అర్ధరాత్రి 1:30 గంటలకు తెనాలి, 2:20 గంటలకు గుంటూరు, 3:00 గంటలకు సత్తెనపల్లి, తెల్లవారుజామున 4:00 గంటలకు నడికుడికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని వివరించారు.
అదేవిధంగా, విజయవాడ - సికింద్రాబాద్ స్పెషల్ (07213) రైలు నేడు,రేపు ఉదయం 6:25 గంటలకు విజయవాడలో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇది ఉదయం 7:03 గంటలకు మంగళగిరి, 7:30 గంటలకు గుంటూరు, 8:18 గంటలకు సత్తెనపల్లి, 8:48 గంటలకు పిడుగురాళ్ల, 9:18 గంటలకు నడికుడి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1:00 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ - విజయవాడ స్పెషల్ (07214) రైలు అక్టోబర్ 17, 18 తేదీల్లో సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 7:28 గంటలకు సత్తెనపల్లి, 8:25 గంటలకు గుంటూరు, 8:58 గంటలకు తెనాలికి చేరుకుని, రాత్రి 9:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.