Kane Williamson: మళ్లీ ఐపీఎల్‌లోకి కేన్ విలియమ్సన్... ఈసారి ఆటగాడిగా కాదు!

Kane Williamson Joins Lucknow Super Giants as Strategic Advisor
  • లక్నో సూపర్ జెయింట్స్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా కేన్ విలియమ్సన్
  • జహీర్ ఖాన్ స్థానంలో ఈ నియామకం
  • విలియమ్సన్ వ్యూహాలు జట్టుకు అమూల్యం అన్న యజమాని గోయెంకా
  • స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ప్రముఖ కోచ్ కార్ల్ క్రో నియామకం
  •  హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ కొనసాగింపు
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సరికొత్త బాధ్యతలు చేపట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీకి అతడు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమితుడయ్యాడు. గత సీజన్ (2025) వరకు జట్టు మెంటార్‌గా ఉన్న భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్థానంలో విలియమ్సన్ ఈ పదవిని అందుకోనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం గురువారం అధికారికంగా ప్రకటించింది.

ఈ నియామకంపై ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఛైర్మన్ గోయెంకా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "సూపర్ జెయింట్స్ కుటుంబంలోకి కేన్‌కు స్వాగతం. ఆటపై ఆయనకున్న లోతైన అవగాహన, వ్యూహాత్మక నైపుణ్యం, ఆటగాళ్లను ఉత్తేజపరిచే సామర్థ్యం మా జట్టుకు ఎంతో విలువైంది" అని పేర్కొన్నారు. విలియమ్సన్ ఇప్పటికే ఎస్‌ఏ20 లీగ్‌లో లక్నో సిస్టర్ ఫ్రాంచైజీ అయిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న లక్నో జట్టు, తమ కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మాజీ స్పిన్ కోచ్ కార్ల్ క్రోను కూడా తమ బృందంలోకి తీసుకుంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్లను ప్రమాదకర బౌలర్లుగా తీర్చిదిద్దడంలో కార్ల్ క్రో కీలక పాత్ర పోషించారు. హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ కొనసాగుతారని, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఇప్పటికే జట్టుతో ఉన్నారని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టు 2024, 2025 ఐపీఎల్ సీజన్లలో వరుసగా ఏడో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2022, 2023 సీజన్లలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ 2026 వేలానికి పటిష్టమైన వ్యూహాలతో సిద్ధమయ్యేందుకు యాజమాన్యం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. 

ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించి 2128 పరుగులు చేశాడు. 2018 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.
Kane Williamson
Lucknow Super Giants
LSG
IPL 2026
Strategic Advisor
Indian Premier League
Durban Super Giants
SA20 League
Cricket
Goenka

More Telugu News