Konda Surekha: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Konda Surekha Absent from Telangana Cabinet Meeting
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
  • కొండా సురేఖ మినహా మంత్రులు అందరూ హాజరు
  • అంతకుముందు భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్‌తో సమావేశం
తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. ఆమె హాజరు కాకపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్ఎల్‌బీసీ పనుల ప్రారంభం, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు.

ఈ మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ మినహా మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. సమావేశానికి ముందు కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌‍తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మేడారం జాతర అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు వచ్చాయి. దీంతో ఇటీవల కొండా సురేఖ తరుచూ వార్తల్లో నిలిచారు.
Konda Surekha
Telangana cabinet meeting
Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Meenakshi Natarajan

More Telugu News