Shyamsunder Reddy: కొడుకు పట్టించుకోవడం లేదని రూ. 3 కోట్ల పొలాన్ని ప్రభుత్వానికి అందించిన మాజీ ఎంపీపీ

Shyamsunder Reddy Donates 3 Crore Land to Government Due to Sons Neglect
  • హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన
  • తన భార్య మృతి తర్వాత కొడుకు పట్టించుకోవడం లేదన్న శ్యాంసుందర్ రెడ్డి
  • సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
కొడుకు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి తనకు చెందిన రూ. 3 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది. ఎల్కతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, వసంత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు కూడా అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో తిరిగి వచ్చారు.

కుమారుడు రంజిత్ హన్మకొండలో భార్య, పిల్లలతో కలిసి సొంతింట్లో నివసిస్తున్నారు. తన భార్య వసంత నాలుగేళ్ల క్రితం మృతి చెందారని, అప్పటి నుంచి కుమారుడు తనను పట్టించుకోవడం లేదని శ్యాంసుందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, తన ఆస్తి మొత్తాన్ని తనకు తెలియకుండానే కుమారుడు పట్టా చేయించుకున్నట్లు ఆయన ఆరోపించారు.

ఈ కారణంగానే తనను పట్టించుకోని కుమారుడికి ఆస్తి దక్కకుండా తన పేరున ఉన్న మూడెకరాల పొలాన్ని ప్రభుత్వానికి అప్పగించినట్లు శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులను చూసుకోలేని వ్యక్తికి ఆస్తి అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, అందుకు అనుగుణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం భవనాలు నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని ఆయన కోరారు.
Shyamsunder Reddy
Shyamsunder Reddy property
Elkathurthy
Hanamkonda
Telangana
Property dispute

More Telugu News