Kiran Mazumdar Shaw: బెంగళూరు రోడ్లపై విదేశీ విజిటర్ వ్యాఖ్యలు.. ఇబ్బందిపడ్డానని బయోకాన్ కిరణ్ మజుందర్ షా ట్వీట్

Kiran Mazumdar Shaw Shares Foreign Visitors Concern on Bangalore Roads
  • ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందిపడ్డానన్న మజుందర్ షా
  • రోడ్ల మీద, రోడ్ల చుట్టూ చెత్త ఎందుకు ఉందని ప్రశ్నించినట్లు వెల్లడి
  • కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసిన కిరణ్ మజుందర్ షా
బెంగళూరు రోడ్లపై ఒక విదేశీ సందర్శకుడు చేసిన వ్యాఖ్యలను బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. బెంగళూరులోని తన బయోకాన్ పార్క్ కార్యాలయంలో ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ట్యాగ్ చేశారు.

బయోకాన్ పార్కుకు ఇటీవల ఒక విదేశీ బిజినెస్ విజిటర్ వచ్చారని, ఆ వ్యక్తి తనతో రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయని అడిగారని ఆమె అన్నారు. రోడ్లపై చుట్టూ ఎందుకు ఇంత చెత్త ఉందని, పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవడం లేదా అని ప్రశ్నించినట్లు తెలిపారు.

ఆ విదేశీ విజిటర్ ఇంకా మాట్లాడుతూ, తాను ఇప్పుడే చైనా నుంచి వచ్చానని, ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదని కిరణ్ మజుందర్ షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారీ వర్షాలు, నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారాయి. రోడ్లు ఇలా ఉండటంపై గతంలోనూ ఒక సీఈవో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గతంలో ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి రావడం సులభంగా ఉండేదని, ఇప్పుడు ఇబ్బందికరంగా మారిపోయిందని బ్లాక్‌బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చారు. కార్యాలయానికి రావాలంటే తమ ఉద్యోగులకు గంటన్నర సమయం తీసుకుంటోందని, గత ఐదేళ్లలో పరిస్థితుల్లో మార్పేమీ లేదని అన్నారు. తాము ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని కూడా వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Kiran Mazumdar Shaw
Biocon
Bangalore roads
Karnataka
Siddaramaiah
DK Shivakumar

More Telugu News