Dhruv Vikram: కబడ్డీ కోర్టులో విక్రమ్ తనయుడు.. ఆసక్తి రేపుతున్న 'బైసన్' ట్రైలర్

Dhruv Vikram Bison Trailer Released
  • తమిళ స్టార్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ కొత్త చిత్రం 'బైసన్'
  • ఈనెల‌ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల
  • కబడ్డీ క్రీడా నేపథ్యంలో వస్తున్న సినిమా
  • సామాజిక వివక్షపై పోరాటమే కథాంశం
  • 'కర్ణన్' ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బైసన్'. 'కర్ణన్', 'మామన్నన్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారి సెల్వరాజ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల‌ 17న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే, ఈ సినిమా కబడ్డీ క్రీడా నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ డ్రామా అని స్పష్టమవుతోంది. 1980ల నాటి తమిళ గ్రామీణ వాతావరణంలో ఈ కథను చూపించనున్నారు. ఒక కబడ్డీ ఆటగాడి జీవితంలోని సంఘర్షణ, సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొనే వివక్ష, దానిపై వారు చేసే తిరుగుబాటు వంటి అంశాలను మారి సెల్వరాజ్ తనదైన వాస్తవిక శైలిలో కళ్లకు కట్టనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ధ్రువ్ విక్రమ్ ఈ చిత్రంలో ఓ పల్లెటూరి కబడ్డీ ఆటగాడిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాల్, పశుపతి, రజిషా విజయన్, అమీర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కబడ్డీ ఆటతో పాటు సామాజిక అంశాలను జోడించి మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

Dhruv Vikram
Bison movie
Mari Selvaraj
Anupama Parameswaran
Kabaddi movie
Tamil cinema
Social drama
Rural Tamil Nadu
Vikram son
Diwali release

More Telugu News