Siddaramaiah: సీఎం పదవిపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు

Siddaramaiah Key Comments on CM Post Fuel Karnataka Congress Rift
  • సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య భిన్నాభిప్రాయాలు
  • ఎమ్మెల్యేల మద్దతు లేనిదే ఎవరూ సీఎం కాలేరని స్పష్టం చేసిన సిద్ధరామయ్య
  • అధిష్ఠానం ఆశీస్సులు కూడా ముఖ్యమేనని వ్యాఖ్య
  • నవంబర్‌లో నాయకత్వ మార్పు ప్రచారంపై ఊపందుకున్న చర్చ
  • మంత్రులతో విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని వెల్లడి
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ, సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్ఠానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల ఓ ప్రాంతీయ చానల్‌తో మాట్లాడిన డీకే శివకుమార్, సీఎం ఎంపికకు అధిష్ఠానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదులిస్తూ “ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరు. మెజారిటీ మద్దతు తప్పనిసరి. అయితే, అధిష్ఠానం ఆశీస్సులు కూడా కచ్చితంగా ఉండాలి. రెండూ ముఖ్యమే” అని తేల్చిచెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్‌ నాటికి రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ, దీనిని కొందరు పార్టీ నేతలు ‘నవంబర్ విప్లవం’గా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. “ఆ విందు భోజనానికి, కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదు. నేను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటాను. అదొక సాధారణ సమావేశం మాత్రమే” అని ఆయన వివరించారు.
Siddaramaiah
Karnataka Congress
DK Shivakumar
Chief Minister
Karnataka Politics
Congress Party
Leadership Change
MLA Support
High Command
November Revolution

More Telugu News