Tirumala: పరకామణి చోరీ కేసులో విచారణ ప్రారంభించిన సీఐడీ

CID Begins Investigation in Parakamani Theft Case
  • సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో పరకామణి చోరీ కేసులో విచారణ
  • పరకామణి ప్రాంగణాన్ని పరిశీలించిన రవిశంకర్ అయ్యన్నార్
  • తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరకామణి చోరీ కేసు రికార్డులు పరిశీలించిన సీఐడీ బృందం
  • సీఐడీ డీజీని కలిసి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ కేసుపై ఏపీ సీఐడీ బృందం అధికారికంగా విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.

సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం తిరుమలకు చేరుకుని విచారణ చేపట్టింది. శ్రీవారి ఆలయ పరకామణి ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం, కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు.

సమాచారం ప్రకారం, 2023 మార్చిలో పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ నిందితుడిగా పట్టుబడ్డాడు. అయితే, సంఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరపలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

తర్వాత లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకొని అప్పటి పాలకవర్గం కేసును మూసివేసిందనే ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానిజాలు వెలికి తీసేందుకు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ ప్రారంభించింది. మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి సీఐడీ డీజీని కలిసి తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. 
Tirumala
Tirumala temple
TTD
Parakamani theft case
CID investigation
Andhra Pradesh
Ravi Kumar
Bhanu Prakash Reddy

More Telugu News