Tejaswi Yadav: బీహార్ కూటమిలో ముదిరిన సంక్షోభం.. సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ప్రతిష్ఠంభన

Tejaswi Yadav RJD Congress Standoff in Bihar Election Talks
  • 61 సీట్లు కావాలని పట్టుబడుతున్న కాంగ్రెస్
  • పట్టువిడుపులకు ససేమిరా అంటున్న తేజస్వి యాదవ్
  • ఢిల్లీలో ఇరు పార్టీల నేతల మధ్య విఫలమైన చర్చలు
  • అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఆర్జేడీ
  • తేజస్వితోనే తేల్చుకోవాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచన
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూటమిలో సీట్ల పంపకాల వివాదం తారస్థాయికి చేరింది. ఇరు పార్టీలు తమ పట్టు వీడకపోవడంతో చర్చలు పూర్తిగా స్తంభించాయి. ఈ పరిణామాల మధ్య ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొందరు అభ్యర్థులకు పార్టీ గుర్తులు పంపిణీ చేసి, అర్ధరాత్రి వాటిని వెనక్కి తీసుకోవడం తీవ్ర గందరగోళానికి దారితీసింది.

సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది. ఈ పరిస్థితుల్లో కూటమితో ముందుకు వెళ్లలేమని తేజస్వి కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. తమకు 61 నుంచి 63 స్థానాలు కేటాయించాలని, ముఖ్యంగా కహల్‌గావ్, నర్కటియాగంజ్, వసాలీగంజ్ వంటి కీలక స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అంగీకరించినా, ఆ నిర్దిష్ట నియోజకవర్గాలను వదులుకోవడానికి ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలోనే ‘గట్టిగా బేరసారాలు చేయండి’ అని రాహుల్ గాంధీ తమ పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ చర్చల అనంతరం తేజస్వి యాదవ్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీతో భేటీ కాకుండానే పట్నాకు తిరుగుపయనం కావడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఆయన పాట్నాకు చేరుకున్న వెంటనే, అప్పటికే సింబల్స్ అందుకున్న ఆర్జేడీ అభ్యర్థులను అర్ధరాత్రి వెనక్కి పిలిపించి వాటిని తిరిగి తీసుకోవడం కలకలం రేపింది. ఆర్జేడీ ఏకపక్ష వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు, కూటమిలోని వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ తీరు కూడా తలనొప్పిగా మారింది. ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమకు చెందిన 10 స్థానాల్లో సహానీ తమ అభ్యర్థులకు సింబల్స్ ఇచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని తేజస్వి యాదవ్ ఆరోపించారు.

ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని బీహార్ కాంగ్రెస్ నేతలు ఖర్గేను కోరగా, మంగళవారంలోగా తేజస్వి యాదవ్‌తో నేరుగా చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కాగా, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి 19 గెలుపొందగా, 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Tejaswi Yadav
Bihar Elections
RJD
Congress
Seat Sharing
Bihar Politics
Lalu Prasad Yadav
Mukesh Sahani
Mahagathbandhan

More Telugu News