Donald Trump: ప్రపంచానికి మరింతమంది ట్రంప్‌లు కావాలి: ఇజ్రాయెల్ ప్రభుత్వం

Israel says world needs more Donald Trumps
  • కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్న ఇజ్రాయెల్
  • ఇజ్రాయెల్ చట్టసభ కనేసెట్ స్టాండింగ్ ఒవేషన్
  • వచ్చే సంవత్సర నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదిస్తామన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. ట్రంప్ వంటి వ్యక్తులు ప్రపంచానికి మరింత మంది అవసరమని ఆకాంక్షించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వం ట్రంప్‌కు ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసెట్ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

వచ్చే సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును ప్రతిపాదిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. ఇజ్రాయెల్ ప్రజాప్రతినిధులు ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. కాల్పుల ఒప్పందం చేసినందుకు గాను లేచి నిలబడి రెండున్నర నిమిషాల పాటు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పీకర్ ఒహనా మాట్లాడుతూ, బందీల విడుదలకు ట్రంప్ కృషి చేశారని కొనియాడారు. యూదు ప్రజలు ఆయనను వేల సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. ప్రపంచంలో శాంతిస్థాపన కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు ప్రపంచంలో ఎవరూ లేరని అన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, యుద్ధం ముగిసేలా గాజా ఒప్పందం చేసినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు ట్రంప్, నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బంగారు పావురాన్ని ట్రంప్‌కు కానుకగా ఇచ్చారు.
Donald Trump
Israel
Benjamin Netanyahu
Israel Hamas ceasefire
Nobel Peace Prize
Jerusalem

More Telugu News