CGHS: కేంద్ర ఉద్యోగులకు డబుల్ ధమాకా.. డీఏ పెంపు తర్వాత మరో కీలక నిర్ణయం

CGHS Package Rates Revised After 15 Years for Central Government Employees
  • 15 ఏళ్ల తర్వాత సీజీహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లను సవరించిన కేంద్రం
  • సుమారు 2000 రకాల వైద్య సేవలు, చికిత్సల ధరల్లో మార్పులు
  • నేటి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
  • నగదు రహిత చికిత్స నిరాకరణ, అధిక ఛార్జీల ఫిర్యాదులతో ఈ నిర్ణయం
  • నగరం, ఆసుపత్రి గుర్తింపు ఆధారంగా వేర్వేరుగా ఉండనున్న ధరలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి వరుసగా ఊరట లభిస్తోంది. ఇటీవలే కరవు భత్యం (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం, తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) కింద వైద్య చికిత్సల ప్యాకేజీ రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు నాణ్యమైన వైద్య సేవలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

ఎందుకీ మార్పులు?
గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పాత రేట్ల వల్ల ఉద్యోగులతో పాటు సీజీహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పలు ఆసుపత్రులు నగదు రహిత (క్యాష్‌లెస్) చికిత్సలను నిరాకరిస్తున్నాయని, రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జరుగుతున్న తీవ్ర జాప్యం కూడా ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే ప్రభుత్వం సుమారు 2000 రకాల వైద్య ప్రక్రియల ధరలను సవరిస్తూ తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది.

అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
సీజీహెచ్ఎస్ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, సవరించిన రేట్లు నేటి (2025 అక్టోబర్ 13) నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది. సీజీహెచ్ఎస్ పరిధిలోని అన్ని ఆసుపత్రులకు, అలాగే ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టుకునే రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. పెన్షనర్లకు నగదు రహిత చికిత్సలు యథావిధిగా కొనసాగుతాయని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నగరం, ఆసుపత్రిని బట్టి ధరలు
కొత్త రేట్లను పలు అంశాల ఆధారంగా నిర్ణయించారు. ఆసుపత్రి ఉన్న నగరం, దానికి ఉన్న అక్రిడిటేషన్ (గుర్తింపు), వార్డుల రకం వంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు టైర్-1 నగరాలతో పోలిస్తే టైర్-2 నగరాల్లో 10 శాతం, టైర్-3 నగరాల్లో 20 శాతం తక్కువగా రేట్లు ఉంటాయి. అలాగే, జాతీయ అక్రిడిటేషన్ బోర్డు గుర్తింపు (ఎన్ఏబీహెచ్‌) లేని ఆసుపత్రులకు 15 శాతం తక్కువ ధరలు వర్తిస్తాయి. మరోవైపు ప్రైవేట్ వార్డుల రేట్లను 5 శాతం పెంచగా, జనరల్ వార్డుల రేట్లను 5 శాతం తగ్గించారు. తాజా నిర్ణయంతో వైద్య చికిత్సల విషయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ఊరట లభించినట్లయింది.
CGHS
Central Government Employees
Central Government Health Scheme
DA Hike
Dearness Allowance
Pensioners
Medical Treatment
Healthcare
Reimbursement
Cashless Treatment

More Telugu News