Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. పెళ్లి ఆలస్యంపై అసలు కారణం చెప్పిన కీర్తి సురేశ్‌

Keerthy Suresh reveals why her wedding had been late
  • భర్త ఆంథోనీ తటిల్‌తో 15 ఏళ్ల ప్రేమాయణం
  • కాలేజీ రోజుల నుంచే ప్రేమలో ఉన్న జంట
  • కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
  • మతం గురించి ఇంట్లో చెప్పడానికి మొదట భయపడ్డానన్న కీర్తి
  • నాన్నకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని వెల్లడి
సినీ హీరోయిన్ కీర్తి సురేశ్‌ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో గతేడాది ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీ రోజుల్లో మొదలైన తమ ప్రేమ పెళ్లి వరకు చేరడానికి ఏకంగా 15 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఆమె తాజాగా వివరించారు. ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టాక్‌ షోలో కీర్తి తన ప్రేమ ప్రయాణం వెనుక ఉన్న కథను బయటపెట్టారు.

తామిద్దరం 2010లోనే, కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డామని కీర్తి సురేశ్‌ తెలిపారు. "అయితే, ముందు నా చదువు పూర్తి కావాలని భావించాను. అప్పటికి కెరీర్‌పై కూడా స్పష్టమైన ఆలోచన లేదు. జీవితంలో ఇద్దరం బాగా స్థిరపడిన తర్వాతే ఒక్కటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి విషయంలో కావాలనే సమయం తీసుకున్నాం" అని ఆమె వివరించారు. ఈ నిర్ణయం ప్రకారమే ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించినట్లు చెప్పారు.

గత ఆరేళ్లుగా తాను సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నానని, అదే సమయంలో ఆంథోనీ ఖతార్‌లో ఆయిల్ పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలు చూసుకునేవారని కీర్తి గుర్తుచేసుకున్నారు. ఇద్దరూ కెరీర్‌లో నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి గురించి ఇంట్లో చెప్పాలనుకున్నట్లు తెలిపారు. "అయితే, మతాల విషయంలో ఇంట్లో ఏమైనా అభ్యంతరాలు వస్తాయేమోనని మొదట కొంచెం భయపడ్డాను. కానీ, నాలుగేళ్ల క్రితం ధైర్యం చేసి మా నాన్న దగ్గరికి వెళ్లి ఆంథోనీ గురించి చెప్పాను. నేను ఊహించినట్లుగా ఆయన నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. చాలా సింపుల్‌గా మా పెళ్లికి ఒప్పుకున్నారు" అని కీర్తి సురేశ్‌ ఆనందంగా చెప్పారు.

ఇలా పదిహేనేళ్ల పాటు రహస్యంగా సాగిన తమ ప్రేమకథకు, గతేడాది హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుని శుభం కార్డు వేశారు. ఆంథోనీకి కొచ్చి, చెన్నైలలో పలు వ్యాపారాలు ఉన్నాయి.

Keerthy Suresh
Wedding
Actress
Tollywood

More Telugu News