Mercedes Benz: జీతం 2 లక్షలు.. 80 లక్షల బెంజ్ కారు.. యువత వింత పోకడపై సోషల్ మీడియాలో చర్చ!

Mercedes Benz craze among youth sparks social media debate
  • రెడిట్‌లో ఓ యూజర్ పోస్ట్‌తో వెలుగులోకి వింత ట్రెండ్
  •  రూ. 7-9 లక్షల డౌన్‌పేమెంట్, మిగిలిన మొత్తానికి ఏడేళ్ల పాటు భారీ లోన్
  •  గొప్పల కోసం ఆర్థికంగా రిస్క్ తీసుకుంటున్నారని పలువురి ఆందోళన
  •  రెండుగా విడిపోయిన నెటిజన్లు
‘నెలకు రూ. 2 లక్షల జీతం.. చేతిలో రూ. 80 లక్షల మెర్సిడెస్ బెంజ్ కారు తాళం’.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ప్రస్తుతం యువతలో కొందరు అనుసరిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. తమ ఆదాయానికి మించిన విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ, ఆర్థికంగా తీవ్రమైన రిస్క్ తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా చర్చిస్తున్నారు.

ఇటీవల ఓ మెర్సిడెస్ షోరూమ్‌కు వెళ్లినట్లు ఒక రెడిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పిన విషయాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపారు. "నెలకు రూ. 1.4 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు జీతం తీసుకునే వాళ్లు కూడా రూ. 60-80 లక్షల విలువైన కార్లను కొంటున్నారు. కేవలం రూ. 7-9 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి లోన్ తీసుకుంటున్నారు. అయితే, వారికి లోన్లు ఇప్పించడానికి తాము చాలా కష్టపడాల్సి వస్తోందని సేల్స్ సిబ్బంది చెప్పారు" అని ఆ యూజర్ వివరించారు.

సమాజంలో గొప్పగా కనిపించడం కోసం ఏడేళ్ల పాటు అప్పుల బానిసత్వంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇది ఆశయం కాదని, "ఆర్థికంగా స్వీయ విధ్వంసం చేసుకోవడమే"నని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఒక యూజర్ స్పందిస్తూ "మా ఇంట్లో పనిచేసే ఆవిడ కొడుకు జీతం రూ. 20 వేలు. మొదటి నెలలోనే రూ. 15 వేలు డౌన్‌పేమెంట్ కట్టి రూ. 2.2 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. ఇంట్లో కనీసం ఫ్రిజ్ కూడా లేదు" అని పేర్కొన్నాడు.

మరోవైపు, ఇది కస్టమర్లను ఆకర్షించడానికి లగ్జరీ బ్రాండ్లు ఉపయోగించే ఒకరకమైన సేల్స్ టెక్నిక్ అని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఇంకొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. "అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారికి సొంత ఇల్లు ఉండి, ఇతర అప్పులు లేకపోతే నెలకు రూ. 40-50 వేల ఈఎంఐ చెల్లించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. మొత్తంమీద, సామాజిక హోదా కోసం ఆర్థిక ప్రణాళిక లేకుండా యువత తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ పోస్ట్ పెద్ద చర్చనైతే రేకెత్తించింది.
Mercedes Benz
Young generation
Luxury cars
Car loans
Financial risk
Social status
Income
EMIs
Reddit
Consumerism

More Telugu News