Lalu Prasad Yadav: లాలు ఫ్యామిలీకి బిగ్ షాక్: ఐఆర్‌సీటీసీ కేసులో అభియోగాల నమోదు.. విచారణకు గ్రీన్ సిగ్నల్!

Lalu Prasad Yadav Family Faces Setback in IRCTC Case Charges Framed
  • ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో లాలూ కుటుంబానికి ఎదురుదెబ్బ
  • లాలు, రబ్రీ, తేజస్వి యాదవ్‌లపై అభియోగాలు నమోదు చేసిన ఢిల్లీ కోర్టు
  • అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి తీవ్రమైన ఆరోపణలు
రైల్వే శాఖలో కలకలం రేపిన ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు చేసింది. దీంతో వారిపై విచారణ ప్రారంభానికి మార్గం సుగమమైంది.

ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసులో నిందితులపై అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి పలు అభియోగాలను ఖరారు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి, కుట్ర, మోసం అభియోగాలు నమోదు కాగా, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లపై కుట్ర, మోసం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. న్యాయమూర్తి అభియోగాలను చదివి వినిపించగా, నిందితులందరూ తాము నిర్దోషులమని తెలిపారు. తమపై మోపిన అభియోగాలను అంగీకరించబోమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో కేసు విచారణ దశకు చేరుకుంది.

కేసు నేపథ్యం ఏమిటి?
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరోపిస్తోంది. ఐఆర్‌సీటీసీకి చెందిన రాంచీ, పూరీలలోని రెండు హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది. ఈ కాంట్రాక్టులకు బదులుగా, లాలూ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కంపెనీకి కోట్ల రూపాయల విలువైన భూమిని చాలా తక్కువ ధరకు బదిలీ చేశారని ప్రధాన ఆరోపణ.

అయితే, యాదవ్ కుటుంబం ఈ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తోంది. తమపై ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసును బనాయించారని వారు వాదిస్తున్నారు. ఈ కేసులో లాలూ కుటుంబంతో పాటు, కేంద్ర మాజీ మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా భార్య సరళా గుప్తా, సుజాత హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్ తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు.
Lalu Prasad Yadav
IRCTC scam
Rabri Devi
Tejaswi Yadav
corruption case
RJD leader
Indian Railways
CBI investigation
Rouse Avenue Court
criminal conspiracy

More Telugu News