Chandrababu: అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu Inaugurates CRDA Office in Amaravati
  • అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం
  • భూములిచ్చిన రైతులతో కలిసి ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాక ఇదే తొలి ప్రభుత్వ భవనం
  • ఒకే ప్రాంగణం నుంచి సీఆర్డీఏ, ఏడీసీఎల్, మున్సిపల్ శాఖల కార్యకలాపాలు
  • కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి పెమ్మసాని, పలువురు ప్రజాప్రతినిధులు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సీఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది.

ఈరోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, భవన నిర్మాణ శైలి, ఇక్కడి సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ ప్రాంగణంలో G+7 అంతస్తుల ప్రధాన భవనంతో పాటు మరో నాలుగు ప్రీ-ఇంజినీర్డ్ భవనాలను (పీఈబీ) కూడా నిర్మించారు. ఇకపై సీఆర్డీయే, ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) కార్యాలయాలతో పాటు పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. దీనివల్ల పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా ఆయన అన్నట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Chandrababu
Amaravati
CRDA
Andhra Pradesh Capital
APCRDA office
Farmers
P Narayana
Municipal Administration
Pemaasani Chandrasekhar

More Telugu News