Burla Ramanjaneyulu: తురకపాలెం బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణిలో గలభా .. ఎమ్మెల్యే బూర్లపై నోరు పారేసుకున్న మాల మహానాడు నేత

Burla Ramanjaneyulu Tension at Turakapalem Check Distribution Mala Mahanadu Leader Outburst
  • తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కుల పంపిణి
  • ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుపై దుర్భాషలాడిన మాల మహానాడు నేత అరుణ్ కుమార్ 
  • అరుణ్ కుమార్ పై గ్రామస్థుల ఆగ్రహం
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఆదివారం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వరుస మరణాలతో విషాదంలో మునిగిన ఆ గ్రామంలోని 28 మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని, ఎవరైనా దళారులు డబ్బులు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. అయితే, అక్కడే ఉన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేను ఉద్దేశించి, "ఇంత దౌర్భాగ్యం మాకు రాలేదు... ఎవడ్రా నువ్వు, యూస్‌లెస్ ఫెలో" అంటూ అరుణ్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సంఘటనతో అక్కడున్న అధికారులు, కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అరుణ్ కుమార్‌ను అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనపై గ్రామస్థులు సైతం అరుణ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. "మా ఊళ్లో మీ పెత్తనం ఏమిటి?" అంటూ నిలదీశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, మరికొంతమంది బాధిత కుటుంబాలు తమకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలని ఎమ్మెల్యేను కోరారు. 
Burla Ramanjaneyulu
Turakapalem
Guntur district
Mala Mahanadu
Golla Arun Kumar
Pemmashani Chandrasekhar
Cheque distribution
Andhra Pradesh politics
Prathipadu MLA
Financial assistance

More Telugu News