Donald Trump: పాక్-ఆఫ్ఘన్ గొడవ కూడా తీరుస్తా.. నాకో లెక్కా?: ట్రంప్

Donald Trump Ready to Mediate Pakistan Afghanistan Conflict
  • పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తానన్న ట్రంప్
  • తాను ఇప్పటికే ఎన్నో యుద్ధాలను పరిష్కరించానని వెల్లడి
  • గాజా శాంతి ఒప్పందంతో ఎనిమిదో యుద్ధానికి తెరదించానని వ్యాఖ్య
  • నోబెల్ గ్రహీత ఆ పురస్కారాన్ని తనకే అంకితమిచ్చారని వెల్లడి
  • భారత్-పాకిస్థాన్ వివాదాన్ని కూడా గుర్తు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాలపై కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తాను ఇప్పటికే ప్రపంచంలోని అనేక క్లిష్టమైన యుద్ధాలను పరిష్కరించానని, ఈ గొడవను కూడా ముగించగలనని ధీమా వ్యక్తం చేశారు.

సోమవారం గాజా శాంతి ప్రక్రియపై ఈజిప్టులో జరగనున్న సదస్సుకు బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "గాజా శాంతి ఒప్పందంతో నేను పరిష్కరించిన ఎనిమిదో యుద్ధం ఇది. ఇప్పుడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా ఓ యుద్ధం జరుగుతోందని విన్నాను. నేను ఈజిప్టు నుంచి తిరిగి వచ్చాక దానిపై దృష్టి పెడతాను. ఎందుకంటే యుద్ధాలను పరిష్కరించడంలో నేను నిష్ణాతుడిని" అని అన్నారు.

గతంలో తాను ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అంతర్జాతీయ వివాదాలను చాలా వేగంగా పరిష్కరించినట్లు ట్రంప్ గుర్తుచేశారు. "భారత్, పాకిస్థాన్ మధ్య గొడవ గురించి ఆలోచించండి. అలాగే 31, 32, 37 ఏళ్లుగా కొనసాగుతూ లక్షల మంది ప్రాణాలను బలిగొన్న యుద్ధాలను కూడా నేను చాలా వాటికి ఒక్క రోజులోనే ముగింపు పలికాను. ఇది చాలా గొప్ప విషయం కదా" అని ఆయన పేర్కొన్నారు. అర్మేనియా-అజర్‌బైజాన్, కొసావో-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్ వంటి దేశాల మధ్య వివాదాలను కూడా తన హయాంలోనే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.

ఇటీవల వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతిపైనా ట్రంప్ స్పందించారు. "నేను నోబెల్ బహుమతి కోసం ఇదంతా చేయలేదు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే చేశాను. నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి (మరియా) ఈ రోజు నాకు ఫోన్ చేసి, 'ఈ పురస్కారాన్ని మీ గౌరవార్థం స్వీకరిస్తున్నాను, ఎందుకంటే దీనికి నిజమైన అర్హులు మీరే' అని చెప్పారు. ఆమెకు నేను ఎప్పటినుంచో సహాయం చేస్తున్నాను" అని ట్రంప్ వెల్లడించారు.
Donald Trump
Pakistan Afghanistan conflict
US mediation
Gaza peace
International disputes
Armenia Azerbaijan
Kosovo Serbia
Israel Iran
Maria Corina Machado
Nobel Peace Prize

More Telugu News