Nimmala Ramanayudu: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanayudu Says Jagan Has No Right to Speak on Liquor Policy
  • గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీలన్నీ జగన్ గుప్పిట్లోనే ఉన్నాయన్న నిమ్మల
  • జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో 27 మంది మృతిని ప్రస్తావించిన మంత్రి 
  • నకిలీ మద్యం తయారీదారులను అరెస్ట్ చేసింది తామేనని వ్యాఖ్య
రాష్ట్రంలో మద్యం విధానంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ అధినేత జగన్ కు ఉందా? అని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీ ఫ్యాక్టరీలన్నింటినీ తన నియంత్రణలోకి తీసుకున్నారని నిమ్మల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారని ఆయన దుయ్యబట్టారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టడమే కాకుండా, వారి జేబులను కూడా ఖాళీ చేశారని, చివరికి లిక్కర్‌పై కూడా రుణాలు తెచ్చారని విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపిందని రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేళ్లూనుకున్న నకిలీ మద్యం దందాను వెలికితీసి, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. "జగన్ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసిన ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?" అని ఆయన నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా నకిలీ మద్యం తయారు చేయాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

ఈ వ్యవహారంలో పాత నేరస్థులు కండువాలు మార్చుకుని వచ్చినా ఉపేక్షించేది లేదని, వారిపై కూడా కఠినంగా వ్యవహరించామని మంత్రి స్పష్టం చేశారు. నకిలీ, కల్తీ మద్యానికి పూర్తిగా అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. 
Nimmala Ramanayudu
Jagan
Andhra Pradesh
liquor policy
fake liquor
adulterated liquor
excise policy
AP Excise Suraksha
Chandrababu Naidu
YSRCP

More Telugu News