Chandrababu Naidu: నకిలీ మద్యం నిగ్గు తేల్చేందుకు 'సిట్' ప్రకటించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces SIT to Probe Fake Liquor
  • నకిలీ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
  • ఐపీఎస్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు
  • సభ్యులుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఎక్సైజ్ నిపుణుడు
  • ఆఫ్రికాలో నేర్చుకుని ఇక్కడ అమలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి
  • ఈ కేసులో దిగ్భ్రాంతికర నిజాలు బయటకొస్తాయని వెల్లడి
  • నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ఆవిష్కరణ
రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈరోజు మీడియా సమావేశంలో నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. సిట్ సభ్యులుగా ఐపీఎస్ అధికారులు రాహుల్ దేవ్ శర్మ (ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్), కె. చక్రవర్తి (సీఐడీ ఎస్పీ), మల్లికా గార్గ్‌ (ఆర్టీజీఎస్)లను నియమించినట్టు తెలిపారు. వీరితో పాటు ఎక్సైజ్ శాఖ నుంచి ఈ అంశంపై పూర్తి అవగాహన ఉన్న ఒక నిపుణుడిని కూడా బృందంలో చేర్చుతామని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం కేసులో దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని అన్నారు. "ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారు ఆఫ్రికాలో నేర్చుకుని ఇక్కడ అమలు చేస్తున్నారు" అని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులను, వారి కార్యకలాపాలను పూర్తిగా వెలికితీసేందుకే సిట్ దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Fake Liquor
Special Investigation Team
SIT
GVG Ashok Kumar
Rahul Dev Sharma
Excise Department
Illicit Liquor
AP News

More Telugu News