రాహుల్కు పట్టిన గతే తేజస్వికి కూడా పడుతుంది: ప్రశాంత్ కిశోర్
- తేజస్వి ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిశోర్
- రఘోపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా లాలూ కుటుంబం ఆధిపత్యంలో ఉందని విమర్శ
- వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య
పాట్నాలోని రఘోపూర్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కాంగ్రెస్కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్కు కూడా అదే గతి పడుతుంది" అని స్పష్టం చేశారు.
రఘోపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా లాలూ కుటుంబం ఆధిపత్యంలో ఉందని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. 1995, 2000లలో లాలూ ప్రసాద్ యాదవ్, 2005లో రబ్రీ దేవి, ఆ తర్వాత 2015, 2020లలో తేజస్వీ యాదవ్ ఇక్కడి నుంచే గెలిచారని గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఒకే కుటుంబం పాలిస్తున్నా, ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.