Kim Jong Un: రష్యా, చైనా కీలక ప్రతినిధుల సమక్షంలో... అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రదర్శించిన ఉత్తర కొరియా

Kim Jong Un Displays Powerful Missile at Military Parade
  • వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా భారీ సైనిక కవాతు
  • పరేడ్‌లో అత్యంత శక్తిమంతమైన హ్వాసోంగ్-20 క్షిపణి ప్రదర్శన
  • తమ సైనికులపై కిమ్ జాంగ్ ఉన్ ప్రశంసలు
అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గడం లేదు. రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల మద్దతుతో మరింత ధీమాగా కనిపిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తాజాగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్యాంగ్యాంగ్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సైనిక కవాతులో ఈ ఆయుధ ప్రదర్శన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రష్యా, చైనాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భారీ సైనిక కవాతులో ‘హ్వాసోంగ్-20’ అనే సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ఐసీబీఎం) ఉత్తర కొరియా ప్రదర్శించింది. దీనిని తమ వద్ద ఉన్న ‘అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్ర వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ’గా అక్కడి ప్రభుత్వ మీడియా అభివర్ణించింది. ఈ క్షిపణితో పాటు సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ లాంచ్ వాహనాలు, భూమి నుంచి గగనతలానికి, భూమి నుంచి భూమికి ప్రయోగించే ఇతర క్షిపణులను కూడా కవాతులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్, చైనా ప్రధాని లీ చియాంగ్, వియత్నాం నేత టో లామ్ వంటి వారు కిమ్ పక్కనే కూర్చొని వీక్షించారు.

ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ, తమ సైన్యం అజేయమైనదని, దేశ భవిష్యత్తు కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రెట్టింపు బలాన్ని ఇస్తోందని అన్నారు. అంతర్జాతీయ న్యాయం కోసం విదేశీ యుద్ధ క్షేత్రాల్లో తమ దళాలు ప్రదర్శిస్తున్న వీరోచిత పోరాట స్ఫూర్తి అద్భుతమని ఆయన పరోక్షంగా ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. రష్యా కోసం పోరాడుతూ దాదాపు 600 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, వేలమంది గాయపడ్డారని దక్షిణ కొరియా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ సైనిక ప్రదర్శనను కేవలం ఒక వేడుకగా కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు బలమైన సంకేతంగా చూడాలని హార్వర్డ్ యూనివర్సిటీ ఆసియా సెంటర్ విజిటింగ్ స్కాలర్ సియాంగ్-హ్యోన్ లీ విశ్లేషించారు. అమెరికాతో దక్షిణ కొరియా బంధం బలపడిన కొద్దీ, దానికి ప్రతిగా తమ గడ్డపై కూడా ఒక శక్తిమంతమైన త్రైపాక్షిక కూటమి ఏర్పడుతోందనే గట్టి హెచ్చరికను ఈ కవాతు పంపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Kim Jong Un
North Korea
Hwasong-20
ICBM
Russia
China
military parade
Dimitry Medvedev
Li Qiang
nuclear weapons

More Telugu News