R Krishnaiah: బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 14న తెలంగాణ బంద్.. బీజేపీ నేతలను కలిసిన ఆర్ కృష్ణయ్య

R Krishnaiah Calls for Telangana Bandh on 14th for BC Reservations
  • బంద్‌కు బీజేపీ మద్దతు కోరిన ఆర్ కృష్ణయ్య
  • పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ నేతలు
  • కోర్టు స్టే, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడి
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తనకు తెలియజేశారని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.

బీజేపీ నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు స్టేకు నిరసనగా, అలాగే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని అన్నారు. 22 బీసీ సంఘాలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్ అని స్పష్టం చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, అందుకే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు.
R Krishnaiah
BC Reservations
Telangana Bandh
BJP
Ramachander Rao
Kishan Reddy
High Court

More Telugu News