Supreme Court: వాట్సాప్ ఖాతా బ్లాక్ చేశారని కోర్టుకెళితే.. 'అరట్టై' వాడమన్న సుప్రీం ధర్మాసనం

Supreme Court Suggests Arattai App After WhatsApp Account Block
  • వాట్సాప్ ఖాతా బ్లాక్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • ఇది ప్రాథమిక హక్కు కాదంటూ పిటిషన్ కొట్టివేత
  • ప్రత్యామ్నాయంగా దేశీ యాప్ 'అరట్టై' వాడాలని సూచన
  • 'మేక్ ఇన్ ఇండియా' యాప్‌ను ప్రోత్సహించాలన్న ధర్మాసనం
  • జోహో అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్‌కు పెరుగుతున్న ఆదరణ
వాట్సాప్‌కు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా దేశీయంగా అభివృద్ధి చేసిన 'అరట్టై' లాంటి యాప్‌లను ఉపయోగించుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది.

వివరాల్లోకి వెళితే...!
ఒక వ్యక్తి తన వాట్సాప్ ఖాతాను ఎలాంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేశారని, దానిని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ఒక పాలీ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారని, గత 10-12 ఏళ్లుగా తన క్లయింట్‌లతో కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్‌నే వాడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, వాట్సాప్ యాక్సెస్ కలిగి ఉండటం ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది. "ఒకవేళ వాట్సాప్‌ లేకపోతే ఏంటి? కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్‌లు అందుబాటులో ఉన్నాయి కదా! ఈ మధ్యే వచ్చిన స్వదేశీ యాప్‌ ‘అరట్టై’ ఉంది. దాన్ని వాడుకోండి. 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించండి" అని ధర్మాసనం హితవు పలికింది.

ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైనది కాదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. దీంతో, కోర్టు అనుమతితో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.

ఏమిటీ 'అరట్టై' యాప్?
'అరట్టై' యాప్‌ను ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ జోహో అభివృద్ధి చేసింది. తమిళంలో 'అరట్టై' అంటే సంభాషణ లేదా పిచ్చాపాటీ లేదా ముచ్చట అని అర్థం. ఇప్పటికే కోటి మందికి పైగా వినియోగదారులను సంపాదించుకున్న ఈ యాప్, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్‌తో పాటు మీటింగ్‌లు, ఫొటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. త్వరలోనే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా తీసుకురానున్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.
Supreme Court
WhatsApp
Arattai app
Make in India
Zoho
Sridhar Vembu
WhatsApp block
Indian apps
communication app
Article 32

More Telugu News