Girl chases thief: పిల్ల కాదు పిడుగు.. దొంగను వెంటపడి తరిమిన బాలిక.. వీడియో ఇదిగో!

Hyderabad Girl Bhavani fearlessly chases thief
  • కుత్బుల్లాపూర్ లో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగ
  • కింది పోర్షన్ లో శబ్దాలకు అప్రమత్తమైన బాలిక
  • ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగి వచ్చి దొంగను పట్టుకునే ప్రయత్నం
  • బాలికను చూసి పరుగందుకున్న దొంగ.. వెంటపడ్డ బాలిక
ఇంట్లో దొంగలు పడ్డారంటే పెద్దవాళ్లే భయపడే రోజులివి.. అలాంటిది ఓ బాలిక మాత్రం దొంగనే భయపెట్టింది. ఆడపిల్ల కాదు అగ్గిపుల్లరా బాబూ అనుకుంటూ పారిపోయేలా చేసింది. దొంగతనం మాట దేవుడెరుగు పట్టుబడకుండా ఉంటే చాలని పరుగులు పెట్టినా వదలకుండా వెంటాడింది. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ బాలిక చూపిన ధైర్యానికి చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు కూడా ప్రశంసలు కురిపించారు.

వివరాల్లోకి వెళితే..
కుత్బుల్లాపూర్  చింతల్ భగత్ సింగ్ నగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో ఓ దొంగ పట్టపగలే చోరీకి ప్రయత్నించాడు. ఆ ఇంటి పైపోర్షన్ లో ఉండే భవాని అనే బాలిక కింద నుంచి వినిపిస్తున్న శబ్దాలకు అప్రమత్తమైంది. కిందికి దిగి చూడగా.. దర్జాగా లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను మూటకడుతున్న అగంతుకుడు కనిపించాడు. దీంతో ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని భవాని ప్రయత్నించింది.

భవానీని చూసిన దొంగ భయంతో పరుగందుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాలికి బుద్ధి చెప్పాడు. అయితే, దొంగను విడిచిపెట్టే ఉద్దేశం లేని భవాని కూడా దొంగ వెంట పడింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది. కొద్దిదూరం వెంటాడినా ఫలితంలేకుండా పోయింది. కాగా, భవానీ చూపిన తెగువకు చుట్టుపక్కల వారితో పాటు పోలీసులు కూడా ఆమెను ప్రశంసించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో గుర్తుతెలియని దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Girl chases thief
Bhavani
Hyderabad theft
Kuthbullapur
Chintal Bhagat Singh Nagar
Telangana crime
cctv footage
police investigation
theft attempt
brave girl

More Telugu News