Cherka Mahesh: జూబ్లీహిల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కీల‌క నేత రాజీనామా

Cherka Mahesh Resigns from BJP Jubilee Hills Citing Congress Alliance
  • పార్టీకి రాజీనామా చేసిన మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్
  • రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని తీవ్ర ఆరోపణ
  • బీసీ రిజర్వేషన్ల విషయంలో రెండు పార్టీలు ప్రజలను వంచించాయని విమర్శ
  • దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటన
  • ఇకపై ఏ జాతీయ పార్టీలోనూ కొనసాగలేనని స్పష్టీకరణ
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ  ఓ కీలక నేత బీజేపీకి రాజీనామా చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కమలదళంలో కలకలం రేపింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు పంపించారు.

సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నాయకత్వం కుమ్మక్కై అవకాశవాద రాజకీయాలు చేస్తోందని చెర్క మహేశ్ తన లేఖలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "దేశంలో శత్రువులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం కలిసిపోయాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో సామాజిక న్యాయం చేయడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి" అని ఆయన విమర్శించారు. రైతులు, యువత, మహిళలు, బీసీ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ ప్రభుత్వం తరఫున గొంతు విప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలను, ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహేశ్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో గానీ, పార్లమెంట్‌లో గానీ బీజేపీ నేతలు ఏనాడూ ప్రశ్నించిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

ఇకపై తన రాజకీయ ప్రయాణం గురించి వివరిస్తూ, దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలవడమే తన బాధ్యత అని మహేశ్ తెలిపారు. ఈ కష్టకాలంలో ఆయన అర్ధాంగి సునీతకు పూర్తి మద్దతుగా ఉంటానని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇకపై ఏ జాతీయ పార్టీలోనూ కొనసాగలేనని తేల్చిచెప్పారు. తనకు ఇన్నాళ్లూ అవకాశం కల్పించినందుకు బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Cherka Mahesh
BJP
Jubilee Hills
Telangana BJP
Ramchander Rao
Revanth Reddy
Maganti Gopinath
Telangana Politics
BJP Resignation
Congress BJP Alliance

More Telugu News