Mental Health: మానసిక సమస్యలకు మందు మన పొట్టలోనే... అధ్యయనంలో ఆసక్తికర విషయాలు!

A healthier gut may help improve depression and anxiety says study
  • మానసిక ఆరోగ్యానికి, పేగుల్లోని సూక్ష్మజీవులకు మధ్య బలమైన సంబంధం
  • యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
  • డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలకు కొత్త చికిత్సా మార్గాలకు అవకాశం
  • ప్రోబయోటిక్స్, ఆహార మార్పులతో మానసిక ఆరోగ్యం మెరుగుపడే ఛాన్స్
  • ప్రస్తుత మందులకు స్పందించని వారికి ఈ పరిశోధన ఓ కొత్త ఆశ
మన మానసిక ఆరోగ్యానికి, పొట్టలోని పేగులకు సంబంధం ఉందంటే నమ్మగలమా? కానీ ఇదే నిజమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధిస్తున్న డిప్రెషన్ (కుంగుబాటు), యాంగ్జయిటీ (ఆందోళన) వంటి తీవ్రమైన మానసిక సమస్యలకు పరిష్కారం మన పేగుల్లోనే దాగి ఉందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. ఈ ఆవిష్కరణ మానసిక ఆరోగ్య చికిత్సా విధానంలో ఒక విప్లవాన్నే సృష్టించగలదని నిపుణులు భావిస్తున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు పేగులు, మెదడు మధ్య ఉన్న సంబంధంపై లోతైన అధ్యయనం చేశారు. పేగుల్లో నివసించే కోట్ల సంఖ్యలోని సూక్ష్మజీవులు (గట్ మైక్రోబయోమ్) మెదడు పనితీరును, రసాయన సమతుల్యతను నేరుగా ప్రభావితం చేయగలవని తమ పరిశోధనలో బలమైన ఆధారాలు కనుగొన్నారు. ఈ కీలక వివరాలను ప్రతిష్ఠాత్మక 'నేచర్ మెంటల్ హెల్త్' జర్నల్‌లో ప్రచురించారు.

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శ్రీనివాస్ కామత్ మాట్లాడుతూ... “మానసిక ఆరోగ్య పరిశోధనలలో పేగు-మెదడు సంబంధం అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. మన జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులు రసాయన, నరాల మార్గాల ద్వారా మెదడుతో మాట్లాడతాయని, మన మానసిక స్థితిని, ఒత్తిడి స్థాయులను, ఆలోచనా శక్తిని కూడా ప్రభావితం చేస్తాయని మాకు ఇప్పటికే తెలుసు” అని వివరించారు. పేగుల్లోని మార్పులు మానసిక వ్యాధులకు కారణమవుతాయా? లేక కేవలం వాటి లక్షణమా? అనే ప్రశ్నకు ఈ అధ్యయనం సమాధానం ఇస్తోందని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో మూడింట ఒక వంతు మందికి ప్రస్తుత మందులు లేదా చికిత్సలు సరిగా పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొత్త పరిశోధన ఆశాకిరణంగా మారింది. పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ పాల్ జాయిస్ మాట్లాడుతూ... "మానసిక వ్యాధులలో పేగు బ్యాక్టీరియా ప్రత్యక్ష పాత్ర పోషిస్తోందని రుజువైతే, వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణ పద్ధతులు పూర్తిగా మారిపోతాయి. ప్రోబయోటిక్స్, సరైన ఆహారం వంటి మైక్రోబయోమ్ ఆధారిత చికిత్సలు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, అందరికీ అందుబాటులోకి వస్తాయి" అని తెలిపారు.

జంతువులపై చేసిన ప్రయోగాలలో పేగుల్లోని సూక్ష్మజీవులను మార్చడం ద్వారా వాటి ప్రవర్తన, ఒత్తిడి స్థాయులలో మార్పులు రావడం జ‌రిగింది. అలాగే డిప్రెషన్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలున్న వారిలో పేగుల పనితీరు అస్తవ్యస్తంగా ఉండటం వంటివి గమనించారు. ఆహారం, పర్యావరణం, జీవనశైలి వంటి అంశాలు పేగు-మెదడు సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు భవిష్యత్తులో మరింత విస్తృతమైన పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Mental Health
Srinivas Kamath
gut microbiome
depression
anxiety
gut bacteria
probiotics
brain health
mental illness
South Australia University

More Telugu News