Vidadala Rajini: ఆరోగ్యశ్రీని చంపే కుట్ర జరుగుతోంది: విడదల రజిని

Vidadala Rajini alleges conspiracy to destroy Aarogyasri
  • కూటమి ప్రభుత్వంపై విడదల రజని విమర్శలు
  • ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపాటు
  • నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయి పెట్టారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పేదలకు సంజీవని అయిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం ‘అనారోగ్యశ్రీ’గా మారిపోయిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.

ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు సుమారు 3 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని విడదల రజిని తెలిపారు. బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. దీంతో చేసేదేమీ లేక నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేసి, బోర్డులు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైద్య సేవలు నిలిచిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లు, నెట్‌వర్క్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల నుంచి 3,257కి పెంచామని, నెట్‌వర్క్ ఆసుపత్రులను 900 నుంచి 2,300కి విస్తరించామని రజిని గుర్తుచేశారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య ఆసరా వంటి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీని చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రజిని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే పనుల్లో ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఆమె, ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 
Vidadala Rajini
Aarogyasri
Andhra Pradesh
Chandrababu Naidu
YSRCP
Health sector crisis
Network hospitals
Medical bills
Healthcare
AP Politics

More Telugu News