Janardhan Rao: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావు అరెస్టు!

Janardhan Rao Arrested in Fake Liquor Case
  • గన్నవరం ఎయిర్ పోర్టులో జనార్దనరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణ కోసం రహస్య ప్రదేశానికి తరలింపు
  • ఈ రోజు కోర్టులో హాజరుపర్చే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) విజయవాడకు చెందిన జనార్దనరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి జనార్దనరావు విజయవాడ వస్తున్నాడన్న సమాచారంతో గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు మాటువేశారు. ఆయన విమానం దిగి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆయనను పోలీసులు విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

జనార్దనరావు, అతని అనుచరుడు రాజు కలిసి ములకలచెరువు కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఇటీవల దాడులు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జనార్దనరావు సోదరుడు జగన్మోహనరావును పోలీసులు అరెస్టు చేశారు.

ములకలచెరువులో తయారుచేసిన నకిలీ మద్యాన్ని విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటుచేసిన బాట్లింగ్ యూనిట్‌లో ప్రాసెసింగ్ చేసినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించి, విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గోల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ బాటిళ్లలో నింపినట్లు నిర్ధరించారు. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్ స్టిక్కర్లు, కార్టన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుంచి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం తరలించినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. తన సోదరుడు జగన్మోహనరావు సాయంతో జనార్దనరావు ఈ దందా నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆఫ్రికా దేశాల్లో మద్యం తయారీలో ఆరితేరి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న జనార్దనరావు గత నెల 24న దక్షిణాఫ్రికాకు వెళ్లారు. ఈ నెల 5వ తేదీనే ఆయన తిరిగి రావాల్సి ఉండగా, ఇక్కడి మద్యం దందా వెలుగుచూడటంతో అక్కడే ఆగిపోయారు. ఈ దందాలో తన పేరు రావడంతో ఆయన అక్కడి నుంచే తనకు దీనితో ఎటువంటి సంబంధం లేదంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే ఆయన పోలీసులకు లొంగిపోవడానికి రాగా, ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
Janardhan Rao
Andhra Pradesh illicit liquor
fake liquor case
Mulaakalacheruvu
Ibrahimpatnam
Gannavaram Airport
liquor mafia
counterfeit alcohol
Jaganmohan Rao

More Telugu News