Donald Trump: అసలు వయసు 79... కానీ గుండె వయసు 65.. ట్రంప్ ఫిట్‌నెస్‌పై అవాక్కవుతున్న ప్రపంచం!

Donald Trump Fitness Stuns World at 79 with a Heart Age of 65
  • 79 ఏళ్ల వయసులోనూ అత్యంత ఆరోగ్యంగా డొనాల్డ్ ట్రంప్
  • అసలు వయసు కన్నా గుండె వయసు 14 ఏళ్లు తక్కువని వెల్లడి
  • ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని వైద్యుల నివేదిక
  • వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో వార్షిక ఆరోగ్య పరీక్షల పూర్తి
  • అంతర్జాతీయ పర్యటనల ముందు ఫ్లూ, కోవిడ్ బూస్టర్ టీకాలు
  • వైద్య పరీక్షల నివేదికను అధికారికంగా విడుదల చేసిన శ్వేతసౌధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై శ్వేతసౌధం కీలక ప్రకటన విడుదల చేసింది. 79 ఏళ్ల వయసులో కూడా ఆయన అత్యంత ఆరోగ్యంగా ఉన్నారని, ముఖ్యంగా ఆయన గుండె వయసు (కార్డియాక్ ఏజ్) అసలు వయసు కన్నా ఏకంగా 14 ఏళ్లు తక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఆసక్తికర విషయాన్ని శ్వేతసౌధం శుక్రవారం విడుదల చేసిన ఒక మెమోలో వెల్లడించింది.

మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్ వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల అనంతరం ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా ఒక నివేదికను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌కు సమర్పించారు. "అధ్యక్షుడు ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన గుండె, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థతో పాటు శారీరక పనితీరు చాలా బలంగా ఉంది" అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈసీజీ నివేదికల ఆధారంగా అంచనా వేసే గుండె వయసు, ఆయన అసలు వయసు కన్నా 14 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు డాక్టర్ వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ట్రంప్, తన తీరిక లేని షెడ్యూల్‌తో నిత్యం బిజీగా ఉంటారు. త్వరలో గాజా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఆయన మధ్యప్రాచ్య దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు ఆయన వార్షిక ఫ్లూ వ్యాక్సిన్‌తో పాటు అప్‌డేటెడ్ కోవిడ్-19 బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని శ్వేతసౌధం తెలిపింది.

గత ఏడాది జులైలో ట్రంప్ కాళ్ల వాపు, చేతిపై గాయాలతో కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, 70 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కనిపించే "క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ" అనే సమస్య వల్లే కాళ్ల వాపు వచ్చిందని, తరచుగా కరచాలనం చేయడం వల్ల చేతిపై గాయమైందని అప్పట్లో వైద్యులు స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం ఏప్రిల్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఆయన 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 102 కిలోల బరువు ఉన్నారని, కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉందని వెల్లడించారు. తాజా నివేదికతో ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న అన్ని అనుమానాలకు శ్వేతసౌధం తెరదించినట్టయింది.
Donald Trump
Trump health
Donald Trump fitness
cardiac age
White House
US President
Walter Reed National Military Medical Center
Sean Barbellla
Middle East

More Telugu News