Tejashwi Yadav: బీహార్‌లో హోరాహోరీ: సర్వేలో ఎన్డీఏ ముందంజ.. సీఎం అభ్యర్థిగా తేజస్వికే జై!

Tejashwi Yadav Favored as CM in Bihar Polls Despite NDA Lead
  • బీహార్ ఎన్నికలపై సీ ఓటర్ సర్వే..ఎన్డీఏ కూటమికి స్వల్ప ఆధిక్యం
  • ముఖ్యమంత్రి రేసులో ముందున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
  • మూడో స్థానానికి పడిపోయిన ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్
  • నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు
  • ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' పార్టీకి 13 శాతం ఓట్లు దక్కే అవకాశం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు ఈ ఉత్కంఠను మరింత పెంచాయి. ఈ సర్వే ప్రకారం, అధికార బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే ప్రజలు పట్టం కట్టారు.

సీ ఓటర్ సర్వే అంచనాల ప్రకారం ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి 38.3 శాతం ఓట్లతో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' పార్టీ కూడా 13.3 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచి కీలక పాత్ర పోషించనుంది.

కూటముల వారీగా ఫలితాలు ఇలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు వచ్చాయి. ఏకంగా 36.5 శాతం మంది ప్రజలు తేజస్వి యాదవ్‌కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత 23.2 శాతంతో ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలవగా, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేవలం 15.9 శాతం మద్దతుతో మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం.

కూటముల్లో కొలిక్కిరాని సీట్ల పంచాయతీ
ఎన్నికల తేదీలు సమీపిస్తున్నా, రెండు ప్రధాన కూటముల్లోనూ సీట్ల పంపకాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఎన్డీఏలో జేడీయూ 102, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 45 సీట్లు డిమాండ్ చేస్తుండటంతో చర్చలు కొలిక్కి రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పాట్నా చేరుకుని నేతలతో సమావేశమయ్యారు.

ఇక విపక్ష మహాఘట్‌బంధన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్జేడీ 135 నుంచి 140 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా, మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 50-52 సీట్లు ఆఫర్ చేసింది. అయితే, కాంగ్రెస్ 70 సీట్లు కావాలని పట్టుబడుతోంది. గత ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లే గెలుచుకున్న నేపథ్యంలో, ఈసారి కాంగ్రెస్ డిమాండ్‌కు ఆర్జేడీ తలొగ్గడం లేదు. సీపీఐ (ఎంఎల్) కూడా తమకు కేటాయించిన సీట్లపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

నవంబర్‌లో రెండు విడతలుగా పోలింగ్
బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో, య్వరలో సీట్ల సర్దుబాట్లు పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి.
Tejashwi Yadav
Bihar Elections
NDA
Mahagathbandhan
Nitish Kumar
Prashant Kishor
Bihar Politics
Lok Sabha Elections
Bihar Assembly Elections
C Voter Opinion Poll

More Telugu News